ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం విజయం గురించి తప్పుడు ప్రచారం చేసిన విదేశీ మీడియా తీరుపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఐఐటీ మద్రాసు 62వ కాన్వకేషన్ సందర్భంగా విదేశీ మీడియాపై దోవల్ విమర్శలు గుప్పించారు. భారత్‌వైపు జరిగిన నష్టం గురించి ఒక్క ఆధారమైనా.. కనీసం ఫోటో అయినా చూపించాలని సవాల్ విసిరారు. ‘ఒక కిటికీ అద్దం కూడా పగలలేదు – మీరు చూపించగలరా?’ అంటూ ప్రశ్నించారు. ‘‘పాకిస్థాన్ ఇలా చేసింది, అలా చేసింది అని విదేశీ మీడియా చెబుతుంది.. కానీ మీరు ఒక్క ఫొటో చూపించండి.. భారత యుద్ధ విమానంలో కనీసం పగిలి అద్దమైనా చూపించండి... కానీ వారు చూపించేవి ఏంటంటే పాకిస్థాన్‌లో 13 ఎయిర్ బేస్‌లు మే 10కు ముందు, తరువాత ఎలా నాశనం అయ్యాయో చూపించే ఫోటోలే’ అని దొవాల్ తేల్చిచెప్పారు.
అజిత్ దోవల్ వివరించిన ప్రకారం ఆపరేషన్ సిందూర్ సమయంలో మే 9, అర్ధరాత్రి నుంచి మే 10 ఉదయం మధ్య భారత వైమానిక దళం ఇతర విభాగాల సహకారంతో పాకిస్థాన్ వాయుసేన స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. వీటిలో 15కిపైగా బ్రహ్మోస్ క్షిపణలు ఉన్నాయి. పాక్ వైమానిక దళ సామర్థ్యాన్ని అడ్డుకోవడంతో పాటు చైనాపై ఆధారపడిన దాని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
‘‘మేము 9 ఉగ్ర స్థావరాలను నిర్దిష్టంగా ఎంచుకున్నాం. అవి భారత సరిహద్దుల్లో కాకుండా పాక్ అంతర్భాగాల్లో ఉన్నాయి... మొత్తం ఆపరేషన్‌కు 23 నిమిషాలు మాత్రమే పట్టింది.. పాక్‌లోని సర్గోధా, రహీం యార్ ఖాన్, చక్లాలా, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లపై దాడులు జరిగాయి.’’ అని దోవల్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని స్వదేశీ సాంకేతికతకు క్రెడిట్ ఇచ్చిన దోవల్.. ‘‘మనం రూపొందించిన టెక్నాలజీ పట్ల గర్వపడుతున్నాం. బ్రహ్మోస్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, మన సొంత రాడార్లు ఇవన్నీ ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతం చేశాయి’’ అన్నారు. పాక్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టడంలో భారత్ దేశీయంగా తయారుచేసిన ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని పాక్ గోబెల్స్ ప్రచారం చేయగా.. అందులో నిజం లేదని భారత్ ఆధారాలతో సహా బయటపెట్టింది.
ఏప్రిల్ 22నాటి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ పాక్, పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. అనంతరం పాక్ ప్రతిదాడులకు తిప్పికొడుతూ భారత వాయుసేన మే 9 రాత్రి దాని వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై విరుచుకుపడి ధ్వంసం చేసింది. ఈ దెబ్బకు పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడంతో రెండు దేశాల డీజీఎంఓలు మధ్య కాల్పలు విరమణ ఒప్పందం జరిగిన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.
ఇక, ప్రసంగంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను గురించి దోవల్ మాట్లాడుతూ.. ‘‘ఏఐ ప్రతి సంవత్సరాన్ని మలుపు తిప్పేలా మారుస్తుంది. ఇది మెడిసిన్, రక్షణ, ఫైనాన్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో విస్తృతంగా ప్రభావం చూపుతుంది. భారత్ దీన్ని ప్రధాన ప్రాధాన్యతగా తీసుకోవాలి’ అని ఆయన సూచించారు. ఆపరేషన్ సింధూర్ భారత్‌కి సైనిక విజయంలో ఒక మైలురాయి అని,. విదేశీ మీడియా పాకిస్థాన్‌కు మద్దతుగా ప్రచారం చేసినా, ప్రామాణిక ఆధారాలు మాత్రం భారత్ విజయాన్ని చాటుతున్నాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa