ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాసంస్థల్లో వివక్ష చూపితే మూడేళ్ల జైలు, లక్ష జరిమానా

national |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 08:12 PM

విద్యా సంస్థల్లో కుల, ఆర్థిక, మతపరమైన వివక్షను రూపుమాపేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. రోహిత్ వేముల పేరుతో 'కర్ణాటక రోహిత్ వేముల (బహిష్కరణ లేదా అన్యాయం నిరోధక) (విద్య, గౌరవ హక్కు) బిల్లు'ను తీసుకు రావాలని చూస్తోంది. వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు వివక్ష బారిన పడకుండా చూడటమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.


ఈ బిల్లు ప్రకారం.. కుల వివక్షకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించనున్నారు. మొదటిసారి నేరానికి పాల్పడితే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా బాధితుడికి రూ.1 లక్ష వరకు పరిహారం చెల్లించే అధికారాన్ని న్యాయస్థానాలకు కల్పించారు. మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడితే.. శిక్ష మరింత కఠినతరం అవుతుంది. వారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తుంది.


ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశం నిరాకరించడం, అదనపు డబ్బు డిమాండ్ చేయడం, హామీ ఇచ్చిన సౌకర్యాలను అందించడంలో విఫలమవడం వంటి అంశాలు ఈ వివక్ష పరిధిలోకి వస్తాయి. ఒక విద్యాసంస్థ వర్గం, కులం, మతం, లింగం, జాతి బేధాలు చూపకుండా నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. సదరు విద్యాసంస్థకు సైతం ఇదే విధమైన జరిమానాలు విధిస్తారు. అలాంటి సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం లేదా గ్రాంట్‌లను కూడా నిలిపి వేస్తారు.


రాహుల్ గాంధీ చొరవతోనే..


కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సూచనతో కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను నిరోధించడానికి చట్టాన్ని తీసుకురావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాహుల్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిద్ధరామయ్య.. విద్యా వ్యవస్థలో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు వివక్షకు గురికాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ బిల్లును ఉంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.


నాలుగు రోజుల క్రితమే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ కేసుపై సంచలన ప్రకటన చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారిస్తామని.. బాధ్యులైన వారిని ప్రజల ముందు నిలబెడతామని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో 'రోహిత్ వేముల చట్టం' తీసుకువస్తామని పేర్కొన్నారు.


రోహిత్ వేముల గురించి..


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి అయిన రోహిత్ వేముల.. 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నారు. రోహిత్‌తోపాటు మరో నలుగురు దళిత విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి బహిష్కరించడంతోపాటు స్కాలర్‌షిప్‌ను సైతం నిలిపేశారు. ఈ కారణాలతో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖలో తన జీవితంలో ఎదురైన అణచివేత, వివక్ష గురించి పేర్కొన్నారు. రోహిత్ వేముల బలవన్మరణం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. దేశంలోని విద్యాసంస్థలలో కుల వివక్ష, అణచివేతపై చర్చకు దారి తీసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి కారణాలు లభ్యం కాలేదని పేర్కొంటూ.. 8 ఏళ్ల తర్వాత పోలీసులు కేసును క్లోజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa