తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాల కారణంగా భర్తల హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, నెల్లూరు జిల్లా రాపూరులో బాధాకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాపూరుకు చెందిన లేబాక శీనయ్య (28) భార్య చేతిలో బలయ్యాడు. అతడి భార్య ధనమ్మ, తన ప్రియుడు కల్యాణ్‌తో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, ధనమ్మకు కల్యాణ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధానికి శీనయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన ధనమ్మ, ప్రియుడు కల్యాణ్‌తో కలిసి శీనయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఒక పథకం పన్నారు. కరెంట్ వైరుతో శీనయ్య గొంతు బిగించి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ధనమ్మ, కళ్యాణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.ప్రియుడితో కలిసి భార్యలు తమ భర్తలను దారుణంగా హతమార్చిన అనేక ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని, సంబంధాల విచ్ఛిన్నతను స్పష్టం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa