పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జైలులో ఏదైనా హాని జరిగితే.. దానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీరే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జైలులో తనకు, తన భార్య బుష్రా బీబీకి అమానుషమైన, కఠినమైన చికిత్స అందుతోందని ఆరోపించారు.
గత ఏడాది ఆగస్టు 2023 నుంచి అనేక క్రిమినల్ కేసులలో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్.. తన అధికారిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ సందేశాన్ని పంపారు. ముఖ్యంగా పీటీఐ పార్టీ అధికారికంగా దీన్ని ద్రువీకరించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణల ప్రకారం.. జైలులో వారి పట్ల ప్రవర్తన రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. తన భార్య బుష్రా బీబీ సెల్‌లో టీవీని కూడా ఆపేశారని, ఖైదీలుగా తమకు లభించాల్సిన ప్రాథమిక మానవ హక్కులు, చట్టపరమైన హక్కులను కూడా పూర్తిగా నిలిపి వేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హంతకులు, ఉగ్రవాదులను తమ కన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉంచుతున్నారని చెప్పారు.
గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకుని.. తన సతీమణి విషయంలో అసీం మునీర్ వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని తనపై ఒత్తిడి తీసుకురావడమే ఆయన లక్ష్యం అని చెప్పారు. జీవితాంతం జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. నిరంకుశత్వానికి, అణచివేతకు ఎప్పటికీ తలొగ్గనని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ ప్రజలు కూడా నిరంకుశత్వానికి, అణిచివేతకు భయపడి ఆగిపోకూడదని సూచించారు. అంతేకాకుండా చర్చల సమయం ముగిసిందని.. దేశవ్యాప్తంగా నిరసనలకు సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్ కూడా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకే పని చేస్తున్నారని కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. పీటీఐ పార్టీ ఆగస్టు 5వ తేదీ నుండి దేశవ్యాప్త నిరసనలకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఉద్యమంలో ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పాల్గొనాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. తన గొంతును విస్తృతం చేయడానికి.. తాను చేసే పోస్ట్‌లు అన్నింటినీ సోషల్ మీడియాలో రీట్వీట్ చేయాలని కూడా కోరారు. పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa