ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న పొరపాటు ప్రాణాలు తీసేస్తుంది జాగ్రత్త

Life style |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 11:44 PM

ప్రతి అనారోగ్యానికి ఇంటి చిట్కా ఉంటుంది. ప్రతిసారీ మందులు వాడాల్సిన అవసరం లేకుండా చాలా సులువుగా ఈ చిట్కాలతోనే సమస్యలను తగ్గించుకోవచ్చు. తలనొప్పి, కడుపునొప్పి, జలుబు, జ్వరం లాంటి సాధారణ ఇబ్బందులకు చాలా మంది ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. పైగా మెడికేషన్ అతిగా అయితే దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయి. అయితే..చిట్కాలు పాటిస్తున్నారు సరే. కానీ..ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేదే ముఖ్యం.


అందరికీ ఒకటే చిట్కా పని చేయదు. ముఖ్యంగా పసి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. చెన్నైలో ఓ చిన్నారికి జలుబు చేసింది ముక్కు వద్ద కర్పూరం రాస్తే ఊపిరాడక చనిపోయింది. చూశారుగా. ఓ చిన్న పొరపాటు ఎలా ప్రాణాలు తీసేసిందో. అందుకే ఇలాంటి చిట్కాలు పాటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్.


నిపుణులు ఏమంటున్నారు


కర్పూరం ప్రాణాలు తీస్తుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ చెన్నై ఘటన అందుకు ఓ ఉదాహరణ. ఏదైనా సరే సరైన విధంగా వాడితేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఇలా లేనిపోని సమస్యలు వస్తాయి. ప్రాణాలు తీసేంత స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ కర్పూరం చికిత్స అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. కానీ ఏ చిట్కాని ఎవరికి పాటిస్తున్నాం అనేది తప్పకుండా గమనించుకోవాలని చెబుతున్నారు బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పిటల్ కి చెందిన ఇంటర్నల్ మెడిసన్ డైరెక్టర్ డాక్టర్ శీలా చక్రవర్తి. సరైన విధంగా వాడడం తెలియకపోతే అనారోగ్యాలను తగ్గించే కర్పూరమే విషంగా మారి ప్రాణాలు తీస్తుందని వారిస్తున్నారు. ముఖ్యంగా పసి పిల్లలు, చిన్నారులకు వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


ఇంకా ఏం చెప్పారు


పెద్దల మెటబాలిజంతో పోల్చి చూస్తే పిల్లల మెటబాలిజం చాలా విభిన్నంగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ల బాడీ సైజ్ ఆధారంగానే మెడికేషన్ ఇస్తారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కర్పూరంలో అధిక మొత్తంలో టాక్సిసిటీ ఉంటుంది. అంటే విపరీతంగా ఘాటు ఉంటుంది. పెద్ద వారు పీలిస్తేనే ఒక్కసారిగా కళ్లలో మంట పుట్టి నీళ్లు కారతాయి. అలాంటిది అంత పసి పిల్లలకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


కర్పూరం పడనప్పుడు వాంతులు, ఫిట్స్, విపరీతమైన నీరసం లాంటి లక్షణాలు కనిపించే ప్రమాదం ఉంటుంది. పసి పిల్లల్లో ఈ సింప్టమ్స్ పావుగంటలోనే కనిపిస్తాయని వివరిస్తున్నారు డాక్టర్ శీలా చక్రవర్తి. లేదా రెండు గంటల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇదే విషంగా మారి ఊపిరితిత్తుల పని తీరుపై ప్రభావం చూపిస్తుంది. కోమా లేదా మరణం వరకూ వెళ్లే ప్రమాదం ఉంటుంది. చెన్నైలో చిన్నారికి జరిగింది ఇదే.


ఎన్నో సమస్యలు


కర్పూరం కారణంగా పసి పిల్లల్లో నరాల సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. నిజానికి క్యాంఫర్ పాయిజనింగ్ జరిగినప్పుడు వైద్యులు కూడా సరైన విధంగా చికిత్స అందించాలని చెబుతున్నారు డాక్టర్ శీలా చక్రవర్తి. ఫిట్స్ రాకుండా ముందుగా స్టెబిలైజ్ చేయడం ముఖ్యం అని సూచిస్తున్నారు. అటు తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించినా సరే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ శీలా. ప్రొడక్ట్ పై ఉండే లేబుల్ ని సరిగ్గా చదవాలి. వాడే పద్ధతి తెలుసుకోవాలి. అంతే కాదు. ఏ వయసు వారికి వాడవచ్చు అన్నదీ గమనించాలి. ఆ తరవాతే వైద్యుల సలహా తీసుకుని వినియోగించాలి. సొంత వైద్యంతో ఇబ్బందులు తప్పవు. ​


ఏం చేస్తే మంచిది


పసి పిల్లలకు జలుబు చేసినప్పుడు ఏ చిట్కా పడితే అది ట్రై చేయకూడదు. ఆ వయసులో పిల్లలకు మాటలు రావు. వాళ్లకు ఏం జరిగినా ఏడ్చేస్తారు. అందుకే వాళ్లి ఇబ్బంది కలిగించిన చిట్కాలు మాత్రమే పాటించాలి. ముందుగా ఏ సమస్య వచ్చినా సరే పీడియాట్రిషియన్ కి చూపించడం మంచిది. సరైన విధంగా డయాగ్నైస్ చేసిన తరవాత సమస్య ఏంటో తెలుస్తుంది. వైద్యుల సలహాల మేరకు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోవాలి.


నాజల్ డ్రాప్స్ వేస్తే చాలా సులువుగా కొంత మంది పిల్లలకు జలుబు తగ్గిపోతుంది. ఇలాంటివి వైద్యులు ఎలాగో సజెస్ట్ చేస్తారు. వాళ్లు చెప్పినట్టుగా వాడాలి. ముక్కు కారడం, తుమ్ములు లాంటి సమస్యలు ఉంటే అందుకు తగ్గట్టుగా వైద్యులు ఇచ్చిన మందులు మాత్రమే వాడాలి. పొరపాటున కూడా రెండేళ్ల లోపు పిల్లలకు కర్పూరం వాడకూడదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.


అతిగా వాడడం వల్లే ముప్పు


ఐదేళ్ల పిల్లలకు కర్పూరం వాడవచ్చు కానీ ఓ విషయం మాత్రం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు వైద్యులు. క్వాంటిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా అయితే కాస్తంత కర్పూరం వాసన చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువ మొత్తంలో వాడినప్పుడు ఆ ఘాటుకి పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. కర్పూరం నేరుగా అప్లై చేయడాన్ని ఆపేయడమే కాదు. కర్పూరంతో తయారు చేసిన ఇతరత్రా పదార్థాలను కూడా ఎక్కువగా వాడకపోవడమే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఇలాంటి ప్రొడక్ట్స్ ని పిల్లలకు వీలైనంత వరకూ దూరంగానే ఉంచాలి. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa