నిప్పులేనిదే పొగరాదు.. ఇది పెద్దలు చెప్పేమాట.. లోలోపల నిప్పు రగులుతూ ఉంటే తొలుత పైకి కనిపించేది పొగే.. నిప్పురవ్వలు మరింత రాజుకుని మంట చెలరేగినప్పుడు కానీ.. కొంతమంది ఆ విషయాన్ని గ్రహించలేరు. మరికొంతమంది పొగ వాసన పసిగట్టగానే.. ఆ నిప్పును ఆర్పేసే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా కాలిపోయిన తర్వాత.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అని అనుకోవాల్సి వస్తుంది. ఈ మాట రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. పార్టీ లోపల అంతర్గతంగా ఏం జరుగుతుందనే సంగతి గమనిస్తేనే పార్టీకైనా, కూటమికైనా మనుగడ. గమనించకపోతే.. ఉవ్వెత్తున ఎగసిన కెరటం కిందకు పడినట్లే.. పతనం తప్పదు. ఇదంతా ఎందుకంటే జనసేనలో ఏదో జరుగుతోంది.. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది.
జనసేన.. రాజకీయాల్లో ఓ సంచలనం. 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకు పరిమితమైన పార్టీ .. ఐదేళ్లు తిరిగేసరికి వంద శాతం స్ట్రైయిక్ రేటుతో 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. శాసనమండలిలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటుగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. రేపోమాపో పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు కూడా మంత్రివర్గంలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం అవసరమంటూ కూటమి పార్టీల మధ్య ఐక్యతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. అయితే..
ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఐక్యత పైకి మంచిగానే కనిపిస్తోంది. కానీ కొన్ని విషయాల్లో సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన మధ్య వార్ నడుస్తూనే వస్తోంది. అయితే కూటమి పార్టీల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొవ్వూరు జనసేన ఇంఛార్జి టీవీ రామారావును జనసేన అధిష్టానం ఆ పదవి నుంచి తప్పించింది. పార్టీ విధానాలను ఉల్లంఘించారంటూ టీవీ రామారావును ఇంఛార్జి పదవి నుంచి తప్పించడమే కాకుండా.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన నేతలకు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లభించడం లేదంటూ టీవీ రామారావు అంతకుముందు లేఖ రాశారు. ఈ క్రమంలోనే టీవీ రామారావు ఎన్డీఏ కూటమి స్పూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ జనసేన పార్టీ ఆయనను పక్కనబెట్టింది.
బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం ప్రకారం.. అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలు ఉండాలని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసలు జనసేన గెలిచిన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసా అంటూ బొలిశెట్టి ప్రశ్నించారు. అందరిని ఒకచోట కూర్చోబెట్టి చర్చిస్తే తమ బాధేంటో తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని అందరం కలిసుంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని.. లేదంటే ఐదేళ్లు అడుక్కోవాల్సి వస్తుందంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నేతలలో అసంతృప్తి ఉందనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు.
ఇక ఇటీవల కూడా బొలిశెట్టి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను చనిపోవాలని తనతో ఉన్న కొంతమంది నేతలే కోరుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. తాను చనిపోతే తాడేపల్లిగూడెనికి ఉప ఎన్నిక వస్తుందని.. అప్పుడు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమ బాధలు వినాలంటే అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడాలంటూ బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాపైనా బొలిశెట్టి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa