ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ కార్డ్ రాలేదని దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా

international |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 07:55 PM

అగ్రరాజ్యం అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం పడిగాపులు కాయడం ఇప్పుడు కేవలం వ్యక్తిగత సమస్యే కాదు. ఇది అమెరికా కార్పొరేట్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో జాప్యం కారణంగా వివిధ రంగాల్లోని కీలక నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో, పని అనుమతులు (work permits) గడువు ముగియడంతో అత్యంత అనుభవజ్ఞులైన అధికారులు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. అమెరికాలో దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఓ సంస్థ సీఈఓ కూడా తన వర్క్ పర్మిట్ తేదీ ముగిసిందని.. రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. PR కోసం పెరుగుతున్న పెండింగ్ దరఖాస్తులు ఇప్పుడు సీనియర్ స్థాయి నిపుణులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తూ, పని చేస్తున్నప్పటికీ, సరైన పత్రాలు లేకపోవడంతో తమ కీలక స్థానాల్లో వీరిని కొనసాగించలేకపోతున్నారు.


ఈ సమస్యను మరింత స్పష్టంగా తెలియజేసే ఒక హై-ప్రొఫైల్ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. మెట్రోపాలిటన్ అట్లాంటా రాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ (MARTA) సీఈఓ కొల్లీ గ్రీన్‌వుడ్ జులై 17న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన అమెరికా పని అనుమతి గడువు ముగియడం, గ్రీన్ కార్డ్ రావడంలో జాప్యం జరగడంతో తన పదవిలో కొనసాగడం అసాధ్యమైంది. కెనడా జాతీయుడైన గ్రీన్‌వుడ్, తన గ్రీన్ కార్డ్ "త్వరలోనే" అందనుందని MARTA గురువారం ధ్రువీకరించినప్పటికీ, ముందస్తు పదవీ విరమణను ఎంచుకున్నారు. "ఇమ్మిగ్రేషన్ టైమ్‌లైన్‌లు కార్పొరేట్ అమెరికాను దెబ్బతీస్తున్నాయి" అనే వాదనకు ఇది బలమైన ఉదాహరణగా నిలిచింది. కాగా, గ్రీన్ కార్డు స్థానంలో డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


మార్టాపై ప్రభావం


జనవరి 2022లో MARTA సీఈఓగా బాధ్యతలు చేపట్టిన గ్రీన్‌వుడ్, ట్రాన్సిట్ ఏజెన్సీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఇటీవల కాలంలో MARTA కీలక విస్తరణ, మెరుగుదల ప్రాజెక్టుల అమలులో అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఆయన అనూహ్య నిష్క్రమణ, ఇటీవల అమెరికా ట్రాన్సిట్ రంగంలో జరిగిన అనేక ఉన్నత స్థాయి రాజీనామాలకు తోడైంది. వీటిలో చాలా వరకు కార్యాచరణ సవాళ్లు, కఠినతరం అవుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో ముడిపడి ఉన్నాయి. మరోవైపు, విదేశీయులకు వీసాల జారీలో ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది.


గ్రీన్‌వుడ్ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) జూన్ 18, 2025న గడువు ముగిసింది. ఇది ఆయన ముందస్తు పదవీ విరమణ నిర్ణయానికి దారితీసింది. MARTA ధ్రువీకరించిన ప్రకారం, ఆయన గ్రీన్ కార్డ్ "త్వరలోనే" రానున్నప్పటికీ, ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే కెనడా వీసాపై చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నారు. తన పర్మిట్ గడువు ముగిసిన వెంటనే, గ్రీన్‌వుడ్ పనిని ఆపేశారు. ఆయన వ్యక్తిగతంగా MARTA బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్ లీడర్లందరికీ తన పరిస్థితిని తెలియజేశారు. MARTA చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రోండా అలెన్‌కు అధికారాలను బదిలీ చేశారు.


ఈ సవాల్‌తో కూడిన పరిస్థితులను MARTA ఒక ప్రకటనలో అంగీకరించింది. "ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ చాలా విస్తృతమైనది, ఇది గ్రీన్‌వుడ్ వ్యక్తిగత, వృత్తిపరమైన పురోగతిపై ప్రభావం చూపింది. గ్రీన్‌వుడ్ నిర్ణయంతో ఈ సవాళ్లు పరిష్కరమయ్యాయి.. MARTA ఆయనకు మద్దతు ఇస్తుంది’ అని పేర్కొంది. అయితే, ఈ సంఘటన అమెరికా గ్రీన్ కార్డ్ జాప్యాలు కార్పొరేట్ రంగానికి ఎంత పెద్ద సమస్యగా మారుతున్నాయో తెలియజేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa