ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పప్పులో ఇవి వేసి వండితేనే పోషకాలన్నీ అందుతాయి

Recipes |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 10:57 PM

కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇలా పప్పుల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మళ్లీ వీటిని టమాటపప్పు,పప్పు, పప్పు చారు, సాంబార్ ఇలా ఎన్నో రకాలుగా వండుకుని తింటాం. కూరగాయలతో పోలిస్తే చాలా త్వరగా వీటిని వండొచ్చు. ఈజీగా పనైపోతుందని దీన్ని ఎంచుకుంటారనుకోవద్దు. వీటి రుచి అమోఘంగా ఉంటుంది. వేడి అన్నంలో కాసింత పప్పు నెయ్యి అంచుకు ఊరగాయని ఓ అప్పడం వేసుకుని తింటే అబ్బా.. అమృతమే అనుకోండి. అందుకే, ఎంతో ఖర్చు పెట్టి చేసిన నాన్‌వెజ్ వంటలకంటే పప్పుకి కాస్తా ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారని చెప్పొచ్చు. పైగా ఏ ఫంక్షన్స్‌లో అయినా భోజనాలు పెట్టినప్పుడు ఎంత నాన్‌వెజ్ ఫుడ్స్ పెట్టినా వెజ్‌లో కనీసం పప్పునైనా వండుతారు. పప్పు ఉంటే చాలా ఎవరైనా చక్కగా తినేస్తారనే ధైర్యంతో ఇన్ని లాభాలున్న పప్పులు ఎన్ని రకాలు, అసలు ఏ పప్పు తింటే ఏ లాభమో తెలుసుకోవాలిగా. దీంతోపాటు పప్పుల్ని ఎలా వండాలో కూడా సరైన విధంగా, తెలిసి ఉండాలి. అప్పుడే వాటిలోని పోషకాలు అందుతాయి.


కందిపప్పు


పప్పుచారు, ముద్దపప్పు, టమాటపప్పు ఇలా ఏ పప్పు వంటకం రెసిపీకైనా పర్ఫెక్ట్ సరిపోయే పప్పు ఏదైనా ఉందంటే అది కందిపప్పు మాత్రమేనని చెప్పొచ్చు. మిగతా పప్పులతో కూడా వండొచ్చు. కానీ, ఈ పప్పుకి వచ్చిన రుచి మాత్రం రాదు. ఇది రుచి మాత్రమే కాదు. ఇందులో పొటాషియం, మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. ఈ పప్పుని రెగ్యులర్‌గా తింటే రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. స్టిఫ్‌నెస్ కూడా తగ్గుతుంది. ఈ కారణంగా హైబీపి మిమ్మల్ని వేధించదు. రెగ్యులర్‌గా తింటే బీపి కంట్రోల్‌లో ఉంటుంది.


శనగపప్పు


శనగపప్పు కూడా మరో అద్భుతమైన పప్పు అని చెప్పొచ్చు. దీనిని కూడా ఎన్నో రకాల వంటలు వండడానికి ఉపయోగిస్తాం. స్నాక్స్, వంటలు, పిండి వంటలు అబ్బో బోలెడు వండుకోవచ్చు. దీనిలోని గుణాలు తెలిస్తే మళ్లీ మళ్లీ వండుకుని తింటారు కూడా. ఈ పప్పులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంతేకాకుండా, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఈ పప్పుని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అందుకే, ఈ పప్పుని కూడా చక్కగా తినొచ్చు.


మినపప్పు


మినపప్పుని ఎక్కువగా ఇడ్లీ, దోశల్లోకి వాడతాం. మహా అయితే సున్నుండలు చేస్తాం. అలా కాకుండా దీనిని కూడా చాలా మంది రెగ్యులర్‌ పప్పులా వండుతారని ఎంతమందికి తెలుసు. ఇలా పప్పుని మనం వండుకుని తినడరం వల్ల కూడా ఇందులోని కాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియంలు ఎముకల సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఎముకల్ని బలంగా మారుస్తాయి. రెగ్యులర్‌గా తింటే ఎముకలు బలహీనమవ్వడం, విరిగిపోవడం వంటి సమస్యలు ఉండవు.


పెసరపప్పు


పెసలతో తయారుచేసే ఈ పెసరపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇది ఫేవరేట్ పప్పు అని చెప్పొచ్చు. కారణం క్షణాల్లో ఈ పప్పుని వండొచ్చు. ఉడకడానికి ఎక్కువ టైమ్ పట్టదు. కాబట్టి, చాలా మంది ఈ పప్పు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పైగా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పప్పులో ఎక్కువగా సోల్యూబుల్ ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ముఖ్యంగా, బాడీలోని వేడిని తగ్గిస్తాయి. అందుకే, చాలా మంది ఎండాకాలంలో పెసరపప్పు వండుకుని తినాలని చెబుతారు. ఈ పప్పులోని గుణాలు త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దీంతో గ్యాస్, బ్లోటింగ్ ఇతర సమస్యలు కూడా రావు. మీరు పెసల రూపంలో తీసుకున్నా, పెసరపప్పులా తీసుకున్నా లాభాలు ఒకేలా ఉంటాయి.


ఉలవలు


ఉలవల్ని ఎక్కువగా ఉలవచారు, ఉలవచారు బిర్యానీ వంటి వాటికే వాడతారు. కానీ, వీటిని రెగ్యులర్‌గా మనం ఏదో రకంగా తీసుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడతాయి. వీటిలోని గుణాలు మనకి ఇమ్యూనిటీని పెంచి శక్తి పెరిగేలా చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల డీటాక్సిఫికేషన్ సరిగా జరుగుతుంది. మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. ఇమ్యూనిటీ పెరగడం వల్ల చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు.


ఎర్ర కందిపప్పు


ఎర్ర కందిపప్పునే చాలా మంది మైసూర్ పప్పు అంటారు. ఎక్కువగా టమాట కాంబినేషన్‌తో ఈ పప్పుని వండుతారు. ఇందులో నాన్ హీమ్ ఐరన్, ఫోలెట్స్ ఉంటాయి. ఈ పప్పుని తీసుకోవడం వల్ల అనీమియా వంటి రక్తహీనత సమస్యలు రావు. ముఖ్యంగా ఆడవారిలో. అందుకే, ఆడవారు ఈ పప్పుని వారి డైట్‌లో యాడ్ చేసుకోండి.


ఎలా వండాలి?


ఇలా ఏ పప్పు తీసుకున్నా సరే వాటిని సరైన విధంగా వండితేనే వాటిలోని గుణాలు మనకి అందుతాయి. వీటిని వండేటప్పుడు విటమిన్ సి అంటే చింతపండు, నిమ్మరసం, ఉసిరి వంటివి యాడ్ చేయాలి. దీని వల్ల మనకి వీటి నుంచి ఐరన్ పూర్తిగా అందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa