ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో చేపలు తినకూడదు,,,, ఎందుకో తెలుసా

Recipes |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 11:32 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వర్షాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఏది పడితే అది తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక, చాలా మంది ఆరోగ్యానికి మంచిదని చేపలు తింటుంటారు. అంతేకాకుండా వర్షాకాలంలో చేపలు ఎక్కువగా దొరుకుతాయని వాటిని ఓ పట్టు పడుతుంటారు. అయితే, వర్షాకాలంలో చేపలు తినకూడదని నిపుణులు అంటున్నారు.


​చేపలలో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే సూపర్ ఫుడ్‌గా వీటిని అభివర్ణిస్తారు. చికెన్, మటన్ కన్నా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినప్పటికీ, వర్షాకాలంలో చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలుగుతుందని మీకు తెలుసా? వర్షాకాలంలో చేపలు ఎందుకు తినకూడదు, తింటే ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


వర్షాకాలంలో కాలుష్యం ఎక్కువ


వర్షాకాలంలో పడే వానలు నీటి కాలుష్యానికి, సూక్ష్మజీవుల కార్యకలాపాల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది జల పర్యావరణ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా చేపలు వాటి సహజ ఆవాసాలలో హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు , విషపదార్థాలకు గురవుతాయి. కలుషితమైన చేపలను తినడం వల్ల గ్యాస్ట్రోఎంటెరిటిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఎ వంటి ఆహార సంబంధిత అనారోగ్యాలు వస్తాయి. అంతేకాకుండా, వర్షాకాలంలో అధిక తేమ ఉంటుంది. దీంతో, చేపలు త్వరగా చెడిపోతాయి. అవి తాజాగా కనిపించినప్పటికీ తినడానికి ఏ మాత్రం మంచివి కావని గుర్తించుకోండి.


నీటి ద్వారా వచ్చే వ్యాధుల ముప్పు


వర్షాకాలంలో నదులు, కాలువలు, చెరువులు కలుషితం కావడం వల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. నీటి వనరులలో నివసించే చేపలు ఈ వ్యాధులకు గురవుతాయి. ఉదాహరణకు, జంతువుల మూత్రం ద్వారా నీరు ఎక్కువగా కలుషితం అవుతుంది. దీని వల్ల సంక్రమించే లెప్టోస్పిరోసిస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో సర్వసాధారణం. ఈ ఇన్ఫెక్షన్ సోకిన చేపలను తినడం వల్ల వ్యక్తులు అనేక రోగాల బారిన పడే ప్రమాదముంది. ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీయవచ్చు.


నిల్వ చేపలు అమ్మే అవకాశం


వర్షాకాలంలో, నదులు, చెరువులు, సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. దీని కారణంగా చాలా తీరప్రాంతాల్లో చేపలు పట్టడం నిషేధిస్తారు. అలాంటి పరిస్థితుల్లో, వర్షాకాలంలో మార్కెట్లో చేపల డిమాండ్‌ని తీర్చడానికి, వాటిని ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతారు. ఈ చేపలను ఎక్కువ కాలం ఉంచితే చెడిపోవచ్చు. దీనితో పాటు, నిల్వ చేసిన చేపలలోని పోషకాలు నశిస్తాయి. తాజా చేపల కన్నా వీటిలో పోషకాలు ఉండవు. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.


చేపలు గుడ్లు పెట్టే సమయం


వర్షాకాలం చేపల సంతానోత్పత్తి సమయం. అనేక జాతులు మంచినీటి వనరులలో గుడ్లు పెట్టడానికి వలసపోతాయి. ఈ కాలంలో చేపలు పట్టడం వల్ల వాటి పునరుత్పత్తి చక్రాలకు అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా చేపలతో పాటు గుడ్లను తింటే, కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా ఫుడ్ పాయిజినింగ్ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా చేపలు గుడ్లు పెట్టే సమయంలో వాటిని తినకపోవడం ఓ బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఈ సమయంలో చేపలు తింటే వాటి సంఖ్య తగ్గే ప్రమాదముందని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.


బలహీనమైన జీర్ణవ్యవస్థ


వర్షాకాలంలో మనిషి జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో చేపలు తినడం మంచిది కాదు. చేపల్ని జీర్ణించుకోవడం జీర్ణవ్యవస్థకు కష్టమవుతుంది. దీని కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా మురికి నీటిలో పట్టే చేపలు తినడం వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో చేపల జోలికి పోకపోవడమే మంచిది.


​చేపలు ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఇతర ముఖ్యమైన పోషకాలకు మూలం. అయినప్పటికీ వర్షాకాలంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బాక్టీరియా, పరాన్నజీవులు, విషపదార్థాలతో కలుషితమైన చేపలను తినడం వల్ల కలిగే ప్రమాదాలు ఎక్కువ. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరగడంతో పాటు మిమ్మల్ని తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో పడేయవచ్చు. అంతేకాకుండా చేపల మనుగడను దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలో వాటిని తినకూడదని నిపుణులు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa