చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనలో సంక్షేమ వసతిగృహాలు నరకానికి నకళ్ళుగా మారాయన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరిజిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా హాస్టల్ విద్యార్ధులకు కనీసం మంచి ఆహారం కూడా అందడం లేదని, కలుషిత ఆహారంతో విద్యార్ధులు ఆసుపత్రిపాలవుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పాలనలో విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలను కక్షసాధింపులో భాగంగా నిర్వీర్యం చేశారని, పేద విద్యార్ధుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది. గడిచిన వారం రోజులుగా పేపర్ల నిండా సంక్షేమ హాస్టళ్లలో సరైన వసతులు లేక పిల్లలు పడే అగచాట్ల గురించి రాస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు. సాక్షాత్తు హోంమంత్రి అనిత స్వయంగా హాస్టల్‌ను సందర్శించి అక్కడ భోజనం తిని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భోజనానికి వాడుతున్న రేషన్ బియ్యం బాలేదని చెప్పిన తర్వాత కూడా ప్రభుత‌్వంలో చలనం లేదు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కింద పడుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు నీళ్లు పప్పు, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారు. పిల్లలు కప్పుకోవడానికి దుప్పట్లు సరఫరా చేయడం లేదు. విద్యార్ధులు వాడుకునేందుకు బాత్రూంలు, మరుగుదొడ్లు ఉండటం లేదు. హాస్టల్ పరిసరాలు మురుగునీటితో నిండి అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. దోమలతో అనారోగ్యం పాలవుతున్నా పరిసరాల పరిశుభ్రతకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. దోమ తెరలు ఇవ్వడం లేదు. వర్షాలతో పిల్లలు రోగాలబారిన పడుతుంటే ఎక్కడా సంరక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వెనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లల బాగోగులు, సంక్షేమం గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa