జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఏప్రిల్ 22న చోటు చేసుకున్న ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా విభాగాల నిర్లక్ష్యం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘రక్షణ మంత్రి గంటపాటు మాట్లాడారు.. అధికార పార్టీకి చెందిన ఇతర ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదం, జాతీయ భద్రత, చరిత్ర అన్నింటి గురించి మాట్లాడారు. కానీ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారు... ఏప్రిల్ 22న 26 మంది అమాయకులు తమ కుటుంబసభ్యుల ముందే హతమయ్యారు. అది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది?’ అంటూ ఆమె నిలదీశారు.
పహల్గామ్‌లో చనిపోయిన శుభమ్ ద్వివేది అనే యువకుడి గురించి ప్రియాంక గాంధీ చెబుతూ.. ‘‘ఆరు నెలల కిందటే వివాహం చేసుకున్న అతడు ఏప్రిల్ 22న బైసరన్ లోయకు భార్యతో వెళ్లాడు.. ఆహ్లాదకరమైన వాతావరణం. పిల్లలు ట్రాంపోలిన్‌పై ఆడుతుండగా, ఎవరో జిప్ లైన్ చేస్తూ, ఇంకొందరు టీ తాగుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.. ఆ సమయంలో నలుగురు ఉగ్రవాదులు అడవి లోంచి వచ్చి, శుభాన్ని అతడి భార్య ఎదుటే హతమర్చారు. తరువాత ఒక గంట పాటు మిగిలిన 25 మందిని గుర్తించి చంపారు’’ అని అన్నారు.
శుభం భార్య ఐశాన్య వేదనను ప్రస్తావిస్తూ.. ‘‘నా ప్రపంచమే కళ్లముందే ముగిసిపోయింది.. ఒక్క జవాన్ కూడా లేడు. ప్రభుత్వం మమ్మల్ని అక్కడ వదిలేసింది’’ అని ఆమె అన్నారు. ‘‘ప్రతి రోజు 1,000–1,500 మంది పర్యాటకులు బైసరన్ లోయకు వెళ్తారు. అయినా ఎందుకు ఒక్క సైనికుడిని కూడా అక్కడ భద్రత కోసం నియమించలేదు? కనీసం ప్రథమ చికిత్స సౌకర్యం కూడా లేదు. ప్రజలు ‘సర్కార్ భరోసా’తో వెళ్లారు. కానీ ప్రభుత్వం వాళ్లను ‘భగవాన్ భరోసా’ వదిలేసింది,” అంటూ కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రస్థాయి విమర్శించారు.
‘‘పహల్గామ్ ఉగ్రదాడికి రెండు వారాల ముందు కశ్మీర్ వెళ్లిన కేంద్ర హోం మంత్రి ‘ఉగ్రవాదం ముగిసింది’ అని చెప్పారు.. దాడి తర్వాత మూడు నెలలకి ‘భద్రతా వైఫల్యానికే నేనే బాధ్యతవహిస్తున్నా’ అని లెఫ్టినెంట్ గవర్నర్ చెబుతుాను... అంతేనా? ఎవ్వర్నీ ప్రశ్నించరా?’ అని వయనాడ్ ఎంపీ మండిపడ్డారు.
పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను 2019లో ఉగ్రసంస్థగా కేంద్రం గుర్తించిందని ప్రియాంక అన్నారు. ‘‘అంటే ప్రభుత్వానికి ఇది తెలుసు. అయినా ఈ దాడి ప్రణాళిక గురించి ఒక్క ఏజెన్సీకి కూడా ముందే సమాచారం అందలేదా? ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యం’’ అని ఆరోపించారు.
అంతేకాదు, 2008 ముంబయి దాడులు గురించి అధికార పార్టీ విమర్శలు చేస్తోంది... కానీ అప్పుడు ఒకర్ని మినహా అదే రోజు అందరి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పట్టబడిన అతడ్ని (కసబ్)ను కూడా 2012లో ఉరితీశారు.. అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి ఇద్దరూ దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఢిల్లీ హింస చూసింది.. మణిపూర్ మండిపోయింది. ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది. ఇవన్నీ హోం మంత్రి అమిత్ షా హయాంలో జరిగాయి. అయినా మీరు స్వీయ ప్రశంసలతో తలదించుకుంటున్నారు. దేశంపై ఏ దాడి జరిగినా ఈ సభలోని ప్రతి సభ్యుడు మీ వెంటక ఉంటారు. కానీ నాయకత్వం అనేది ప్రశంసలు కాదు, బాధ్యత తీసుకోవడమే’’ అంటూ ప్రియాంక చురకలంటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa