ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో చైనా పౌరులు, సంస్థలపై దాడులు,,,,అసిమ్ మునీర్‌కు బీజింగ్ వార్నింగ్!

international |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:39 PM

చైనా ఒన్ బెల్ట్.. ఒన్ రోడ్డ్ ఇనిషియేటివ్‌ (బీఆర్ఐ)లో భాగంగా చేపట్టిన చైనా పాకిస్థాన్‌ ఎకనమిక్ కారిడార్ (సిపెక్) దాయాదికి గుదిబండగా మారింది. ఈ కారిడార్‌ అమలకు విఘాతం కలిగించే పరిణామాలు పాకిస్థాన్‌‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంలో చైనా నుంచి తరుచూ హెచ్చరికలు ఎదుర్కొనే పరిస్థితి నెలకుంది. ఇటీవల పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌తో జరిగిన భేటీలో చైనా కేంద్ర మిలిటరీ కమిషన్ వైస్-చైర్మన్ జాంగ్ యోషియా..పాక్‌లో ఉన్న చైనీయులు, ప్రాజెక్టులు, సంస్థల భద్రతను నిర్ధారించాల్సిన అవసరాన్ని గట్టిగానే స్పష్టం చేశారు. సిపెక్ విషయంలో రక్షణ బాధ్యతలను పాక్ నిర్లక్ష్యం చేస్తోందన్న భావనతో చైనా తరచూ ఇటువంటి హెచ్చరికలు చేస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు కూడా పాక్ దగ్గరవడం చైనాకు మింగుపడటం లేదు.


 పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన అనంతరం చైనా సైనిక నాయకత్వంతో జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. ఇది చైనా-పాకిస్ధాన్ సంబంధాలలో భద్రత ప్రధాన సవాలుగా మారిందనే అంశాన్ని తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (CPEC) భద్రతాపరంగా ముప్పు ఎదుర్కొంటోంది. పాక్‌లోని చైనా పౌరులు, సంస్థలపై తరుచూ జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్ నేషనల్ కౌంటర్ టెర్రిజం అథారిటీ (NACTA) 2024 నివేదిక ప్రకారం.. 2021 తర్వాత వివిధ దాడుల్లో 20 మంది చైనా పౌరులు మృతిచెందగా, 34 మంది గాయపడ్డారు. ఇది పాక్ భద్రత వైఫల్యమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ముఖ్యంగా తాలిబాన్ అనుబంధ సంస్థ టీటీపీ (TTP), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గ్రూప్‌లు లక్షిత దాడులకు దిగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో చైనీయులపై టీటీపీ దాడులు చేస్తుండగా.. సిపెక్‌ను బలూచ్ సాయుధులు తమ వనరుల దోపిడీగా చూస్తున్నాయి. చైనా మౌలిక సదుపాయాలు వీరి ప్రాథమిక లక్ష్యంగా మారాయి. పాక్‌లో క్షీణిస్తున్న భద్రతా వ్యవస్థలు, ప్రాంతీయ అసంతృప్తు పెరుగుదలతో బలూచ్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. మాంగోచర్ లాంటి పట్టణాలను రెబల్స్ స్వాధీనం చేసుకోవడం, క్వెట్టా- కరాచీ జాతీయ రహదారి (NH-25) నిర్బంధం, రైళ్ల హైజాక్‌, దాడులు, మహిళా అత్మాహుతి బాంబర్లను ఉపయోగించడం వంటి చర్యలు చైనా ప్రాజెక్టుల కార్యకలాపాలను నిరోధిస్తున్నాయి.


ఇక బిజినెస్ టు బిజినెస్ (B2B) సహకారాన్ని ప్రోత్సహించే సిపెక్ రెండో దశ భద్రతపై ఆధారపడి ఉంటుంది. కానీ భద్రతా లోపాలు, కాలక్రమేణా ఈ ప్రాజెక్టు సార్ధకతను ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం ఉంది. భద్రతను బలోపేతం చేయడానికి స్పెషల్ సెక్యూరిటీ డివిజన్‌లు, సేఫ్ సిటీ పథకాలు, విమానాశ్రయలో సెక్యూరిటీ మెరుగుపరచడం వంటి చర్యలను పాకిస్థాన్ తీసుకుంటున్నా.. ఇవి వ్యూహాత్మకంగా కాకుండా తాత్కాలికంగా కనిపిస్తున్నాయి. తమ భద్రతా సిబ్బందిని ప్రత్యక్షంగా పాల్గొనడానికి పాక్ అనుమతి నిరాకరించడం, చైనాకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.


బీఆర్‌ఐను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చైనా.. పాకిస్థాన్‌లో తమ ప్రాజెక్ట్‌ మనుగడకు ముప్పుగా మారడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. భద్రతా విఫలమైతే కేవలం స్థానిక సమస్యగా మాత్రమే కాదు భౌగోళికరాజకీయ అంశంగా మారుతుంది. దీని ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం ఉంది. బలూచిస్థాన్‌లోని తిరుగుబాట్లకు భారత్ మద్దతిస్తోందన్న ఆరోపణలను చైనా పునరుద్ఘాటించే అవకాశం ఉంటుంది. తద్వారా బలూచ్ కూడా కశ్మీర్ మాదిరిగా జియోపొలిటికల్ స్పాట్‌లైట్‌లోకి వచ్చే ఆస్కారం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa