కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా మార్చేందుకు ఒక పెద్ద ముందడుగు వేసింది. మోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత, లోక్సభ సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ ప్యానెల్ ఇటీవలే బిల్లుపై పరిశీలనలు, సూచనలతో కూడిన 4,500 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 11న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత భారతదేశ పన్ను వ్యవస్థలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద మార్పు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పదాల తగ్గింపు
ఆదాయపు పన్ను బిల్లు, 2025లో 5 ప్రధాన మార్పులు రానున్నాయి. పాత చట్టంలో 4.1 లక్షల పదాలు ఉండగా, కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లో కేవలం 2.60 లక్షల పదాలు ఉన్నాయి. పాత పన్ను సూత్రాలైన పన్ను విధించదగిన ఆదాయం, పన్ను శ్లాబులు, రాయితీలు బిల్లులో అలాగే కొనసాగించారు. ఈ చట్టాన్ని ట్యాక్స్ కన్సల్టెంట్లకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం భాషను సరళీకృతం చేశారు, తద్వారా సమ్మతి పెరుగుతుంది, వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది.
పాత చట్టంలో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి, ఇది అనేక సవరణల కారణంగా చాలా క్లిష్టంగా మారింది. కొత్త బిల్లులో, అధ్యాయాల సంఖ్యను 23కి తగ్గించారు. దీంతో చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభతరం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.
ఈజీ సూత్రాలు, పట్టికలు
కొత్త బిల్లులో, సంక్లిష్టమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలు చేర్చారు. వీటి ద్వారా ట్యాక్స్ సులభంగా లెక్కించవచ్చు. తాము ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఈజీగా తెలుసుకోవచ్చు.
టెక్నాలజీకి అనుగుణంగా
సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును సమీక్షించి అనేక సూచనలు చేసింది. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇందులో సవరణలు ఉండాలని, తద్వారా భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కమిటీ తెలిపింది. ఇప్పుడు, ప్రభుత్వం ఈ బిల్లును ఆగస్టు 11, 2025న పార్లమెంటులో తిరిగి ప్రవేశపెడుతుంది. వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందితే, 2026 నుండి చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
పాత, వాడుకలో లోని నిబంధనల తొలగింపు..
1961 చట్టంలో అసంబద్ధమైన అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక, పన్ను నిర్మాణం పరంగా అవసరమైనవి మాత్రమే చట్టంలో మిగిలి ఉండేలా కొత్త బిల్లులో అటువంటి నిబంధనలు తొలగించారు. చాలా నిబంధనలు కొత్త చట్టంలో లేవని చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa