ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృందావన్ ఆలయ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 07:12 PM

ఉత్తర్ ప్రదేశ్‌లో మథుర సమీపంలో ఉన్న వృందావనం శ్రీ బాంకే బిహారి ఆలయ వివాదంపై సర్వోన్న న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని సూచించింది. అంతేకాదు, శ్రీకృష్ణుడే మనకు మొదటి మధ్యవర్తి అని పేర్కొంది. బాంకే బిహార్ ఆలయ పునఃనిర్మాణం కోసం రూ.500 కోట్లతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందంచింది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ను తీసుకురాగా.. దీనిపై ఆలయ ట్రస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో వివాదానికి దారితీసింది. ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరడంతో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘భగవాన్ కృష్ణ మొదటి మధ్యవర్తి... దయచేసి ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించండి’’అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఆలయ ట్రస్ట్ మధ్య చర్చల కోసం ఓ కమిటీ నియమించాలని సూచించింది.


 అయితే, ముందుగా ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను పరీక్షించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంత హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించింది. అలాగే, ఆలయ నిధుల వినియోగానికి మే 15న సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతిపై కూడా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘ఆ తీర్పును నిలిపివేస్తున్నాం.. రిటైర్డ్ హైకోర్టు లేదా రిటైర్డ్ సీనియర్ జిల్లా న్యాయమూర్తిని ఆలయ నిర్వహణ ట్రస్టీగా నియమించాలి’ అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాఘ్చీల ధర్మాసనం పేర్కొంది.


‘ఈ మధ్యంతర కమిటీ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుని... భక్తుల సౌకర్యం కోసం మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులను వినియోగిస్తుంది’ అని కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేయడానికి, ఆలయ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిలిపివేయాలని కోరే అర్హత ఆలయ ట్రస్ట్‌కు ఉందని తెలిపంది.


ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ తరఫున హాజరైన అడిషిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను ఈ ప్రతిపాదనపై యూపీ ప్రభుత్వంతో చర్చించి, మంగళవారం ఉదయం 10:30లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక, వాదనల సమయంలో ఆలయ నిర్వహణ నుంచి తమను ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం తొలగించిందని, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆర్డినెన్స్‌ ఆమోదించిందని ఆలయ ట్రస్టీ కోర్టుకు తెలియజేశారు. దీంతో యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక పబ్లిక్ నోటీసు అయినా జారీ చేయలేకపోయారా? అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.


అంతేకాదు, ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ కోసం పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ‘అభివృద్ధి పనులు జరగాలంటే.. చట్టప్రకారం ఎందుకు ముందుకు సాగలేదు’ అని కోర్టు ప్రశ్నించింది. మే నెలలో కూడా ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘ప్రైవేట్ పార్టీల మధ్య వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చట్ట నియమాలకు విఘాతం కలిగించడమేనని కోర్టు హెచ్చరించింది.


కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాంకే బిహారి ఆలయం 1862లో నిర్మితమైంది. శెభాయత్‌లు అనే వారసత్వ కుటుంబాలు దీని నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. 2022లో జన్మాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మరణించడంతో ప్రభుత్వ దృష్టిసారించింది. ఆలయ ప్రాంగణంలో భద్రత కోసం కారిడార్ అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సెప్టెంబరు 2023లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa