జార్ఖండ్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక నాయకులలో ఒకరైన శిబు సోరెన్ (81 ఏళ్లు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 'గురూజీ'గా జార్ఖండ్ ప్రజలకు సుపరిచితమైన శిబు సోరెన్ మరణం జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం జరిపిన ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు. గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి ఆయన.. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను స్థాపించారు. ఆయన కృషి ఫలితంగానే 2000వ సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.
మూడుసార్లు సీఎం..
శిబు సోరెన్ దుమ్కా లోక్ సభ నియోజకవర్గం నుంచి 8 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలు అందించారు. 2004 నవంబర్ 27న కేంద్రంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. 2005లో పది రోజులపాటు జార్ఖండ్ సీఎంగా వ్యవహరించిన శిబు సోరెన్.. తర్వాత 2008 ఆగస్టు 28 నుంచి 2009 జనవరి 18 వరకు రెండోసారి సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2009 డిసెంబర్ 30 నుంచి 2010 మే 31 వరకు మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శిబు సోరెన్ కుమారుడే కావడం విశేషం. శిబు సోరెన్ మరణ వార్త తెలిసిన వెంటనే హేమంత్ సోరెన్ రాంచీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు శిబు సోరెన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గిరిజన వర్గాలకు, పేదలకు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం శిబు సోరెన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
శిబు సోరెన్ మరణం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మనుగడకు సవాల్‌గా నిలిచే అవకాశం ఉంది. హేమంత్ సోరెన్‌ను గతంలో ఈడీ అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్ మీద బయటకొచ్చిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ చరిత్రలో 12 మంది సీఎంలుగా పని చేయగా.. తండ్రీ కొడుకులైన శిబు సోరెన్, హేమంత్ సోరెన్ సైతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేయడం గమనార్హం.
గూగుల్ ట్రెండ్స్‌లో శిబు సోరెన్:
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మరణం నేపథ్యంలో ఆయనకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి కనబర్చారు. దీంతో ఆయన పేరు గూగుల్ ట్రెండ్స్‌లో కనిపించింది. జార్ఖండ్‌తోపాటు పొరుగున ఉన్న బిహార్‌లోనూ ఆయన గురించి నెట్లో వెతికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa