'మా ఊరిని కాపాడండి' అంటూ బిగ్‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి ఏపీమంత్రి నారా లోకేష్‌కు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుసగా ఊరి సమస్యను వివరిస్తూ ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారూ.. మా గ్రామం నెల్లూరు జిల్లా వరికుంటపాడు.. అక్కడ మైనింగ్‌కు సంబంధించిన పనులు మొదలయ్యాయి.. కానీ స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం రోజు ఆందోళన చేస్తున్న స్థానిక కూటమి నేత ఒకర్ని పోలీసులు తీసుకెళ్లారు.. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. మా గ్రామంలో ప్రజలు ఇప్పటికే ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. మా గ్రామాన్ని రక్షించండి.. మీరు అనుకుంటే, మీకున్న అధికారంతో దీన్ని అపొచ్చు' అన్నారు.
'వాస్తవానికి మైనింగ్‌కు అనుమతి ఉంది.. కానీ జనాలు వ్యతిరేకిస్తున్నారు. మైనింగ్ చేసేవాళ్లు కొన్ని నిబంధనల్ని పాటించడంలేదు.. అందుకే నిబంధనలకు విరుద్దంగా జరుగుతోంది.. ఇదంతా రాజకీయం కోసం చెప్పడం లేదు. ఈ మైనింగ్‌కు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చారని సంగతి తెలుసు. కానీ ఈ పనులు ఇప్పుడు మొదలుపెట్టారు. ప్రజలు దీనిపై ప్రశ్నిస్తున్నారు.. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దు.. అందరం ఊరి కోసం నిలబడుతున్నాము.. పార్టీలకు సంబంధం లేదు' అన్నారు.
'మైనింగ్ చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి కానీ.. ఆ దగ్గరలోని ఇళ్లు, ఆ సమీపంలో నివాసం ఉండే గిరిజన ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఆ సమీపంలోనే ఆలయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మా ఊరి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. సరైన తాగు నీరు కూడా అందడం లేదు. ఈ మైనింగ్ కూడా ప్రారంభమైతే మేమంతా ఊరిలో ఉండటం కష్టంగా మారుతుంది. మా ఊరి ప్రజలకు ఇప్పటి వరకు ధర్నాలు, ఆందోళనలు అంటేనే తెలియదు.. మహిళలు అసలు ఇళ్లలో నుంచి బయటకు కూడా రారు. కానీ ఈ మైనింగ్ దెబ్బకు భయపడి ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నారా లోకేష్ గారూ.. మీరు ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తారు.. ఈ సమస్యపై కూడా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. ఆదిరెడ్డిది నెల్లూరు జిల్లా వరికుంటపాడు.. ఆయన బిగ్‌బాస్ సీజన్ 6లో ఫైనలిస్ట్.. అలాగే బిగ్‌బాస్ షోపై రివ్యూలు ఇస్తుంటారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు, భాస్కరాపురం పంచాయతీల్లో ఖనిజాల కోసం గత ప్రభుత్వ హయాంలో వేలం నిర్వహించారు. ఈ మేరకు పోచ వెంకటర్ రెడ్డి అనే వ్యక్తి వేలంలో వీటిని దక్కించుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మైకా, క్వార్ట్జ్ తవ్వకాల చేపట్టేందుకు సిద్ధంకాగా.. స్థానికులు అడ్డుకున్నారు. అలాగే గ్రామసభలో స్థానికులు నిరసన తెలిపినా అధికారులు పట్టించుకలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వారంతా నిరసనకు దిగారు.. స్థానిక టీడీపీ నేత షేక్ పీరయ్య ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. అయితే ఆయన పీఎస్‌కు వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటు వచ్చింది.. ఈ ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు పీరయ్యకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసనకు దిగారు. ఆ తర్వాత ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించి.. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో వారు ఆందోళన విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa