పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఇటీవల E20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చింది. చాలామంది E20 పెట్రోల్ వాడడం వల్ల ఇంధన సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని, వాహనాల ఇంజిన్లకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భయాలన్నీ నిరాధారమైనవని, శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణల మద్దతు ఎంత మాత్రమూ లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. E20 పెట్రోల్‌ను ఉపయోగించడం వల్ల ఇంధన సామర్థ్యం తక్కువగా తగ్గుతుందని, ఇంజిన్ పనితీరు మెరుగవుతుందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. E20 పెట్రోల్‌లోని ఇథనాల్‌కు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువ ఆక్టేన్ సంఖ్య ఉంటుంది. ఈ అధిక ఆక్టేన్ సంఖ్య ఇంజిన్‌ను మరింత సున్నితంగా, సమర్థవంతంగా పని చేసేలా చేస్తుంది. ముఖ్యంగా ఆధునిక, అధిక కంప్రెషన్ రేషియో గల ఇంజిన్లలో ఇది మెరుగైన పని తీరును చూపిస్తుంది. E20 పెట్రోల్ వాడకం వల్ల ఇంధన సామర్థ్యం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది చాలా స్వల్పం. E10 ఇంధనం కోసం రూపొందించబడినప్పటికీ.. E20కి అనుకూలంగా ఉండే వాహనాలకు మైలేజీలో 1 నుంచి 2 శాతం మాత్రమే తగ్గుదల ఉంటుందని, ఇతర వాహనాలకు ఈ తగ్గుదల 3 నుంచి 6 శాతం వరకు ఉండవచ్చని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే ఈ స్వల్ప నష్టాన్ని కూడా మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్, E20కి అనుకూలంగా ఉండే భాగాల వాడకం ద్వారా తగ్గించవచ్చని పేర్కొంది.
మంత్రిత్వ శాఖ దీని వల్ల దేశానికి కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను కూడా నొక్కి చెప్పింది. ఇథనాల్ కలపడం వల్ల దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొంది. 2014-15 నుండి ఇథనాల్ వాడకం ద్వారా సుమారు 1.40 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగామని వెల్లడించింది. అంతేకాకుండా ఇథనాల్ ఉత్పత్తి కోసం రైతుల నుంచి పంటలను సేకరించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని వివరించింది. ఈ కాలంలో రైతులకి 1.20 లక్షల కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు జరిగాయని చెప్పింది. ఇథనాల్ వాడకం వల్ల 700 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రిత్వ శాఖ వివరించింది.
E20 పెట్రోల్‌కు సంబంధించిన ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) ఇప్పటికే నిర్దేశించాయని.. దీనిలో భాగంగా రబ్బరు, ప్లాస్టిక్ వంటి భాగాల క్షీణతను నిరోధించే రసాయనాలను ఇంధనంలో కలుపుతారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల పాత వాహనాలకు కూడా పెద్దగా నష్టం జరగదని, ఒకవేళ ఏవైనా భాగాలు మార్చాల్సి వచ్చినా, అవి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవని పేర్కొంది. E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాలకు హాని జరుగుతుందని లేదా వినియోగదారులకు అనవసరమైన ఆర్థిక భారం పడుతుందని జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం అని తేల్చి చెప్పింది. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా, దశలవారీగా అమలు చేయబడుతోందని.. ఇది దేశ ఇంధన భద్రత, ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ రక్షణకు ఎంతో కీలకమని తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa