వర్షాకాలంలో ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో మార్పు కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. మరి మిగతా కారణాలేంటో తెలుసుకోండి. రోజుకు మీరు ఎన్ని సార్లు యూరిన్ పాస్ చేస్తారు. మహా అయితే నాలుగు లేదా ఐదు సార్లు. మీరు సరైన విధంగా నీళ్లు తీసుకుంటే నాలుగైదు సార్లు యూరిన్ రావడం అనేది మామూలే. కానీ..అంతకు మించి వెళ్లాల్సి వస్తోందంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్తపడాలి. అయితే...ఇలా తరచూ యూరిన్ రావడానికి కేవలం అనారోగ్యం మాత్రమే కారణం కాకపోవచ్చు. కొన్ని సార్లు వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీరు సరిగ్గా గమనిస్తే వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. మరి ఇలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. వర్షాకాలంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడానికి కారణాలేంటి. ఇలా జరగడం వెనక అసలైన రీజన్స్ ఏంటి. ఈ వివరాలు తెలుసుకుందాం.
తరచూ యూరిన్
మీ బ్లాడర్ ని మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తే. తరచూ మూత్రం వెళ్లాల్సి వస్తే. చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. వేసవిలో అయితే..శరీరంలో ఉన్న నీరు, వ్యర్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కానీ.. వర్షాకాలంలో ఆ అవకాశం ఉండదు. చాలా తక్కువగా చెమట పడుతుంది. అందుకే..దాదాపు వ్యర్థాలన్నీ యూరిన్ ద్వారానే ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. వర్షాకాలంలో తరచూ యూరిన్ రావడానికి కారణం ఇదే. అయితే దీంతో పాటు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా మూత్రం ఉత్పత్తి అవుతుంది. బ్లాడర్ చాలా త్వరగా నిండిపోతుంది. ఇప్పటికే యూరిన్ సమస్యలతో ఇబ్బందులు పడే వారిలో వర్షాకాలంలో ఇంకాస్త ఎక్కువగా యూరిన్ వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ సమస్యను ఎదుర్కొంటారు.
ఎందుకు ఇలా
ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కారణంగా యూరిన్ ఎక్కువగా వస్తుంటుంది. వర్షాకాలంలో బ్లాడర్ కండరాలు సంకోచానికి గురవుతాయి. ఇలా ప్రెజర్ పడడం వల్ల యూరిన్ కి వెళ్లాలన్న సంకేతాలు వస్తాయి. వెంటనే మీరు యూరిన్ పాస్ చేసి వస్తారు. ఒక్కోసారి బ్లాడర్ నిండకపోయినా సరే వాతావరణం చల్లగా ఉండడం వల్ల కండరాలు సంకోచిస్తాయి. అప్పుడు హీట్ పుట్టించేందుకు కండరాలు కదులుతాయి. ఈ ప్రక్రియ జరిగిన ప్రతిసారీ యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది.
బ్లాడర్ చాలా త్వరగా నిండిపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. అయితే..దీని వెనకాల మరో కారణం కూడా ఉంది. దీన్నే Cold diuresis అంటారు. అంటే..వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాడీ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇది. ఎక్కువ సమయం పాటు చలి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ కండీషన్ తలెత్తుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు రక్త నాళాలు సంకోచానికి గురవుతాయి. చర్మానికి తక్కువ రక్తం అందుతుంది.
తరవాత ఏం జరుగుతుంది
చర్మానికి సరైన విధంగా రక్త సరఫరా అందకపోతే అప్పుడు మిగతా అవయవాల చుట్టూ రక్తం చేరుకుంటుంది. అదే సమయంలో వేడి కూడా పుడుతుంది. సంకోచానికి గురైన రక్త నాళాల ద్వారానే రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బీపీని తగ్గించడం కోసం కిడ్నీలు ఇంకాస్త ఎక్కువగా పని చేస్తాయి. ఈ ప్రాసెస్ లోనే యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా యూరిన్ ప్రొడ్యూస్ కాగానే బ్లాడర్ నిండిపోతూ ఉంటుంది. అలా తరచూ యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. సో దీని వెనకాల ఇంత సైన్స్ ఉందన్నమాట. అయితే..ఇలా పదేపదే యూరిన్ కి వెళ్లడం అనేది ఇబ్బంది కలిగించే విషయం. అయితే ఆ సమయంలో కాస్త వెచ్చగా ఉండే దుస్తులు వేసుకోవడం, చల్ల గాలిలో తిరగకపోవడం, బ్లాంకెట్ కప్పుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. వీటి వల్ల కొంతైనా యూరిన్ ఔట్ పుట్ తగ్గుతుంది.
ఏం చేయాలి
ఇందాక చెప్పుకున్నట్టుగా Over Active Bladder వల్లే ఇలా జరుగుతుంది. అయితే..ఈ సమస్యను తగ్గించుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సిట్రస్, షుగర్, మసాలా ఫుడ్స్, కఫైన్ లాంటివి బ్లాడర్ లో ఇన్ ఫ్లమేషన్ పెరగడానికి కారణమవుతాయి. అందుకే..వీలైనంత వరకూ ఈ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. వర్షాకాలంలో వీటిని తినడం తగ్గించాలి. యూరిన్ తరచూ వస్తోంది కదా అని నీళ్లు తాకుండా అసలు ఉండకూడదు. కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు నీళ్లు తీసుకుంటూ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అయితే.. మరీ ఎక్కువగా తాగితేనే ఇబ్బందులు తప్పవు. అందుకే కాస్త మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తాగితే చాలా త్వరగా బ్లాడర్ నిండిపోతుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉండేలా సరైన మోతాదులో నీళ్లు తాగడం ఆరోగ్యకరం అని గుర్తుంచుకోవాలి.
డాక్టర్ ని కలవాలా
వర్షాకాలంలో ఇలా జరగడం సహజమే. కానీ..మరీ ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించడం మంచిది. సొంత వైద్యాలు ఇలాంటి పరిస్థితుల్లో పనికి రావన్న సంగతి గమనించాలి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఇబ్బందికి తగిని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా చికిత్స తీసుకోవడం మంచిది. లేదంటే లక్షణాలు మరీ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వేసుకుంటే చాలా సులువుగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa