ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మస్థలలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. ఎంత తవ్వినా దొరకని మృతదేహాలు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 08:10 PM

కర్ణాటకలోని నేత్రావతి నది ఒడ్డున, ధర్మస్థల ప్రాంతంలో వందలాది శవాలు పూడ్చిపెట్టినట్లు ఒకప్పటి శానిటైజేషన్ కార్మికుడు భీమ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం దేశం మొత్తం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక సర్కార్.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఇక విజిల్ బ్లోయర్‌గా మారిన భీమను ధర్మస్థల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. అతడు పాతిపెట్టినట్లు చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 1998 నుంచి 2014 మధ్య తాను వందలాది మంది మహిళలు, బాలికలను ఆ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు చెప్పడం పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే మొదట 13 ప్రాంతాలను చూపించిన భీమ.. ఆ తర్వాత మరో కొత్త ప్రదేశంతో పాటు.. ఇంకో 3 ప్రాంతాలను సిట్ అధికారులకు చూపించాడు.


అందులో మొదట చూపించిన 12 ప్రాంతాల్లో సిట్ అధికారులు తవ్వకాలు పూర్తి చేశారు. కానీ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఎముకలు దొరికాయి. ఇంకో ప్రాంతంలో ఉరి వేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇక చివరి 13వ ప్రాంతంలో 8 మందికిపైగా శవాలను పూడ్చి పెట్టినట్లు భీమ వెల్లడించాడు. అయితే సిట్ అధికారులు ఆ ప్రాంతం కాకుండా.. గురువారం రోజున కొత్తగా గుర్తించిన ప్రాంతంలో తవ్వించారు. అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇక శుక్రవారం రోజున మధ్యాహ్నం వరకు సిట్ అధికారులు భీమను విచారించి.. కొత్తగా చూపించిన 3 ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో సాయంత్రం వరకు తవ్వకాలు జరిపారు.


40 ఏళ్ల క్రితం కల్లేరి సమీపంలో మిస్సింగ్ కేసు నమోదైన పద్మలత అనే స్టూడెంట్ ఇంటికి సమీపంలో తవ్వారు. శుక్రవారం సాయంత్రం వరకు తవ్వినా.. ఎలాంటి అవశేషాలు దొరక్కపోవడంతో సిట్ అధికారులు నిరాశతో వెనుదిరిగారు. సిట్ వద్దకు వచ్చిన మొదటి రోజే భీమ ఒక పుర్రెను తీసుకురాగా.. అది 30 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక పురుషునిది అని ఫోరెన్సిక్‌ టీమ్ వెల్లడించింది. మరోవైపు.. ఇంకో 30 ప్రాంతాలు చూపిస్తానని.. అక్కడ తవ్వాలని భీమ సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తవ్వకాలకు సంబంధించిన విషయాలను సిట్ అధికారులు బయటికి చెప్పడం లేదు. తవ్వకాలు చేసే ప్రాంతాలకు భారీగా ఉప్పు మూటలను తరలిస్తున్నారు. అక్కడ దొరికిన వస్తువులను సంచుల్లో నింపి.. తెల్లటి వస్త్రాన్ని చుట్టి తీసుకువెళ్తున్నారు. వాటిని బెళ్తంగడి సిట్ ఆఫీస్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి మణిపాల్‌ కేఎంసీకి తరలిస్తున్నారు. మణిపాల్‌ నుంచి బెంగళూరులోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తీసుకెళ్తుండగా.. వీటన్నింటినీ రహస్యంగా చేస్తున్నారు.


మరోవైపు.. భీమ మొదట చూపించిన 13వ ప్రాంతంలో జీపీఆర్‌ డివైజ్ ఉపయోగించి.. ఆ తర్వాత తవ్వకాలు చేయాలని సిట్ అధికారులు భావించినా.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. పైగా జీపీఆర్‌ డివైజ్.. అద్దెకు తీసుకోవాల్సిన అవసరం రావడంతో అక్కడ తవ్వకాలు కొనసాగలేదు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ధర్మస్థలలో సిట్‌ విచారణను, దానికి సంబంధించిన వివరాలను కవర్ చేసేందుకు వచ్చిన యూట్యూబర్లపై దాడిచేసిన ఘటనలో సోమనాథ సపల్య అనే వ్యక్తిని ధర్మస్థల పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని 3 యూట్యూబ్‌ ఛానెళ్లకు చెందిన నలుగురిపై పాంగళ వద్ద బుధవారం రాత్రి దాడి చేయగా.. 150 మందిపై కేసు నమోదు చేశారు.


ధర్మస్థల ఘటనలో తన ప్రమేయం ఉందంటూ.. మీడియా, యూట్యూబర్లు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని ధర్మస్థల ఆలయ ప్రముఖుడు హర్షేంద్రకుమార్‌ హెగ్గడే వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆంక్షలను కర్ణాటక హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ధర్మస్థల కార్యదర్శి హర్షేంద్ర కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఫలితం రాలేదు. మీమ్‌లు, ట్రోల్స్ ఏమైనా ఉంటే.. వాటిని కర్ణాటక కోర్టులో దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa