బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానాలను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. కొద్ది వారాల క్రితం భారత్‌లోని కేరళలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అవగా, తాజాగా మరో విమానం జపాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో అత్యంత అధునాతనమైన ఈ యుద్ధ విమానాల పనితీరుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక మీడియా కథనాల ప్రకారం, జపాన్‌లోని కగోషిమా విమానాశ్రయంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-35బి విమానం గాల్లో ఉండగా యాంత్రిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన కారణంగా, అధికారులు సుమారు 20 నిమిషాల పాటు ఒక రన్‌వేను మూసివేయాల్సి వచ్చింది. ఫలితంగా కొన్ని వాణిజ్య విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.గత జూన్ 14న బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు వెళుతున్న ఎఫ్-35బి విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో వైఫల్యం కారణంగా కేరళలోని తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ విమానం దాదాపు ఐదు వారాల తర్వాత గానీ గాల్లోకి ఎగరలేకపోయింది. ఎట్టకేలకు బ్రిటన్, అమెరికా నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆ విమానానికి మరమ్మతులు చేయడంతో తిరిగి యూకేకు బయలుదేరి వెళ్లింది. ఇప్పుడు అలాంటి ఘటనే పునరావృతం కావడం గమనార్హం.అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఈ 5వ తరం ఎఫ్-35బి విమానాలను తయారు చేసింది. ఇవి తక్కువ నిడివి ఉండే రన్‌వేపై టేకాఫ్ అవ్వడంతో పాటు, హెలికాప్టర్‌లా నిలువుగా ల్యాండ్ అవ్వగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ విమానాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పర్యటిస్తున్న బ్రిటన్ 'హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్' యుద్ధనౌక బృందంలో భాగంగా ఉంది. ఇటీవలే ఇవి భారత నౌకాదళంతో కలిసి సంయుక్త సముద్ర విన్యాసాల్లో కూడా పాల్గొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa