శరీరంలోని ఏ భాగంలోనైనా గ్యాస్ ఏర్పడితే, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి నొప్పి వస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఛాతీలో మంట, అసౌకర్యంతో బాధపడుతున్నారు. దీనికి కారణం చాలా మందికి తెలియదు. ఛాతీ నొప్పి గ్యాస్ వల్ల వచ్చిందా లేదా గుండెపోటు వల్లా అని ఆందోళనకు గురవుతుంటారు. సాధారణంగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఆ గ్యాస్ ఛాతీ వరకు ప్రయాణిస్తుంది. తక్కువ నీరు తాగడం, ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం, గొంతు నిండే వరకు ఆహారం తినడం, గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు తీసుకోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి.
చాలా మంది గ్యాస్ వల్ల వచ్చిన ఛాతీ నొప్పి తగ్గించడానికి మెడిసిన్ లేదా కొన్ని లిక్విడ్స్ తీసుకుంటారు. అయితే, ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా దీని నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్యలు ఉన్నవారికి ఎక్కువ గ్యాస్ వస్తుంది. ఇలాంటి వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇంట్లోనే గ్యాస్ వల్ల వచ్చిన ఛాతీ నొప్పి తగ్గించగల చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా టీ
పుదీనా జీర్ణ సమస్యల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక, పుదీనా టీ గ్యాస్ సమస్యల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ వల్ల వచ్చిన ఛాతీ నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. పుదీనా టీ జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాల నుంచి ఉపశమనం అందించడంలో సాయపడుతుంది.
సోంపు
భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు నమలడం వల్ల గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపులో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. సోంపుని డైరెక్ట్‌గా నమలవచ్చు. లేదంటే సోంపు టీని కూడా తయారు చేసుకోని తాగవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలు వేసి, 5-10 నిమిషాలు నానబెట్టి వడపోసి తాగాలి.
అల్లం
వంటింట్లో దొరికే అల్లం జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇది గ్యాస్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాల్ని కలిగి ఉంటుంది. ఇందుకోసం ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా తురిమిన అల్లం వేసి 5 నుంచి 10 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసి తాగాలి. లేదంటే అల్లం చిన్న ముక్కను నమలవచ్చు. ఇది గ్యాస్ వల్ల వచ్చి ఛాతీనొప్పి నుంచి తక్షణం రిలీఫ్ అందిస్తుంది.
డాక్టర్ చెప్పిన చిట్కాలు
వాము
వాము గింజలు కడా జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాము గ్యాస్ తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది యాంటీ-స్పాస్మోడిక్, కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంది. ఇందుకోసం అర టీస్పూన్ వామును నేరుగా నమలవచ్చు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ వాము కలిపి తాగవచ్చు.
వెంటనే గోరువెచ్చని నీరు తాగండి
గ్యాస్ వల్ల ఛాతీ నొప్పి వస్తే వెంటనే గోరు వెచ్చని నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ కదలిక సులభతరం అవుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. మలబద్ధకం వల్ల కూడా గ్యాస్ సమస్య రావచ్చు.
ఈ చిట్కాలు కూడా ట్రై చేయండి
* నొప్పి వచ్చినప్పుడు కొద్దిసేపు నిదానంగా నడవడం చేయండి. శారీరక కదలికలు జీర్ణవ్యవస్థలో గ్యాస్‌ను తగ్గించడంలో సాయపడతాయి.
* ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1-2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో, గ్యాస్ తగ్గుతుంది.
* త్వరగా తినడం వల్ల గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి.
* ఒకేసారి ఎక్కువ తినకుండా, తక్కువ మోతాదులో తరచుగా తినండి.
* ఛాతీ నొప్పి వచ్చినప్పుడు, అది గ్యాస్ వల్ల వచ్చిందా లేదా గుండె సంబంధిత సమస్య వల్ల వచ్చిందా అని ఖచ్చితంగా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
* ఛాతీ నొప్పి భుజాలు, చేతులు, మెడ, దవడ లేదా వెనుకకు వ్యాపిస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన సాయం పొందండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa