ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాషింగ్టన్‌ డీసీలో పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీ.. రంగంలోని నేషనల్ గార్డ్స్.. ట్రంప్ సంచలన నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 10:15 PM

రాజధాని వాషింగ్టన్‌ డీసీలో శాంతిభద్రతలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నగరంలో భద్రత కోసం ‘నేషనల్ గార్డ్‌)’మోహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. నేరాలను అరికట్టేందుకు మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ఫెడరల్‌ అధీనంలోకి తీసుకుంటున్నట్లు అమెరికా అధినేత వెల్లడించారు. దేశ రాజధాని పరిధిలో ఈ మేరకు ‘పబ్లిక్‌ సేఫ్టీ ఎమర్జెన్సీ’ని ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో నేరాలు తగ్గుముఖం పట్టాయని నగర్ మేయర్ మురియెల్‌ బౌసర్‌ చేసిన ప్రకటనను కొట్టిపారేసిన ట్రంప్.. ఈమేరకు చర్యలు తీసుకున్నారు.


డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాక్, బ్రెజిల్, కొలంబియా రాజధానులతో పోలిస్తే వాషింగ్టన్‌లో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. అందుకే వాషింగ్టన్‌ డీసీలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించాలనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘ఇది వాషింగ్టన్‌కు స్వేచ్ఛా దినం...తిరిగి మన రాజధానిని నేరరహితంగా మార్చబోతున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, నగరంలోని పార్కుల్లో ఉణ్న నిరాశ్రయుల శిబిరాలను తొలగించే ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభించినట్టు చెప్పారు. అంతేకాదు, స్లమ్ ఏరియాలను కూడా తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. తన నగరాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోదని.. ఈ విషయంలో వాషింగ్టన్ ఒక ఆరంభం మాత్రమేనని అన్నారు. వాషింగ్టన్ మెట్రో పోలీస్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండికి అప్పగించినట్టు ట్రంప్ తెలిపారు.


ఇదిలా ఉండగా, ఇటీవల లాస్‌ఏంజెలెస్ ఫెడరల్ అధికారులు... అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడం, వేలాదిగా వీధుల్లోకి రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో అక్కడ నేషనల్‌ గార్డు బృందాలను మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నట్టు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


అయితే, నగర మెట్రోపాలిటిన్ పోలీస్ విభాగం డేటా ప్రకారం.. 2023 నుంచి 2024 మధ్య వాషింగ్టన్‌ డీసీలో నేరాలు 32 శాతం మేర తగ్గాయి. 2019 తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 12 శాతం మేర తగ్గడం గమనార్హం. ఇక, ట్రంప్ ప్రకటనతో రాజధానిలో 800 మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపగా.. వారిలో 100-200 మందిని మోహరించి, ఏ సమయంలోనైనా శాంతిభద్రతల విషయంలో మద్దతు ఇస్తారని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, ఈ నిర్ణయంపై స్థానిక మేయర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa