ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌తో భేటీ అయింది అసలు పుతిన్ కాదా.., నెట్టింట కొత్త చర్చ

international |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 08:12 PM

దాదాపు 4 ఏళ్లుగా సుదీర్ఘంగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే తాను రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ముందు నుంచీ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయిన ట్రంప్.. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం అయ్యారు. అమెరికాకు రష్యా అమ్మేసిన అలాస్కాలో వీరిద్దరి భేటీ జరిగింది. అయితే యుద్ధాన్ని ముగించేందుకు ఎలాంటి ఒప్పందం కాకుండా ఈ సమావేశం ముగియడం గమనార్హం. ఇక ట్రంప్-పుతిన్ భేటీ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.


ఈ భేటీకి హాజరైంది అసలు పుతిన్ కాదని నెట్టింట నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పుతిన్ నేరుగా హాజరు కాకుండా.. ఆయన తన 'బాడీ డబుల్' (నకిలీ వ్యక్తి)ని పంపించాలని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏదో ఊరికే ఇలాంటి వ్యాఖ్యలు తాము చేయడం లేదని.. తాము చెప్పేవాటికి ఆధారంగా కొన్ని అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. పుతిన్‌ నడక, శరీర భాష, ముఖ కవళికల్లో తేడాలు ఉన్నాయని పేర్కొంటుండటం నెటిజన్ల వాదనకు బలాన్నిస్తోంది. వాటికి సంబంధించిన తేడాలను నెటిజన్లు ఒక్కొక్కటీ ప్రస్తావిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


మరీ ముఖ్యంగా పుతిన్ నడకను "గన్‌స్లింగర్ గేట్" (తుపాకీ పట్టుకునేవారి నడక) అని పేర్కొంటున్నారు. పైగా పుతిన్ కుడి చేయి సాధారణంగా కదలదని.. ట్రంప్‌తో భేటీకి సంబంధించిన వీడియోల్లో చేయి కదిలినట్లు ఉందని తెలుపుతున్నారు. అదే సమయంలో పుతిన్ సైడ్ బై సైడ్ ఫోటోలను పోల్చి చూపిస్తూ.. అలస్కాలో కనిపించిన పుతిన్ సన్నగా ఉన్నాడని.. శారీరకంగా చూస్తే బలహీనంగా కనిపించినట్లు చెబుతున్నారు. పుతిన్ మెడలో కనిపిస్తున్న వాటిని కూడా చెబుతూ.. చిన్న చిన్న తేడాలను కూడా స్పష్టంగా వెలికితీస్తున్నారు.


అయితే పుతిన్ బాడీ డబుల్ ఉపయోగిస్తున్నారని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారినప్పటికీ.. ఇలాంటి వాదనలు కొత్తగా వచ్చినవి ఏమీ కావు. గతంలోనూ.. పుతిన్ బాడీ డబుల్ ఉపయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో.. పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని పుకార్లు షికారు చేశాయి. ఆ సమయంలోనూ బయటికి కనిపించింది పుతిన్ కాదనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇది అబద్ధపు ప్రచారం అని రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.


అయితే భద్రతా కారణాల వల్ల పుతిన్.. బాడీ డబుల్స్‌ను ఉపయోగించుకోవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాదనలపై రష్యా అధికారికంగా స్పందించనప్పటికీ.. బాడీ డబుల్ ఉపయోగించే ప్రతిపాదనను తాము తిరస్కరించినట్లు పుతిన్ గతంలోనే స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సమావేశం తర్వాత ట్రంప్, పుతిన్ జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండి ఉంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని పేర్కొన్నారు. యుద్ధం జరగకుండా అప్పటి అమెరికా ప్రభుత్వాన్ని తాను ఒప్పించడానికి ప్రయత్నించానని పుతిన్ చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa