ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ విభజనకు కారణం కాంగ్రెస్.. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త మాడ్యూల్‌ విడుదల

national |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 10:26 PM

1947లో భారతదేశ విభజన నాటి భయంకర పరిస్థితుల గురించి వివరిస్తూ జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ ( ఎన్‌సీఈఆర్‌టీ ) స్కూల్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ మాడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ' విభజన గాయాల స్మారక దినం ' గురించి ఈ మాడ్యూల్‌లో ప్రస్తావించింది. ఇక దేశం విడిపోవడానికి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే కారణం కాదని.. అందులో ముగ్గురి పాత్ర ఉందని పేర్కొంది. దేశ విభజనకు పట్టుబట్టింది జిన్నా కాగా.. విభజనకు అంగీకరించిన కాంగ్రెస్ పార్టీతోపాటు.. దేశ విభజనను అమలు చేసిన బ్రిటిష్ జనరల్ లార్డ్ లూయీస్ మౌంట్ బాటన్ అని తెలిపింది. ఇక దేశ విభజన కారణంగానే గత కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ అనేది భారత్‌కు ఒక భద్రతా సమస్యగా మారిందని పేర్కొంది. దేశం విడిపోయినప్పటి నుంచి మన పొరుగున ఉన్న పాకిస్తాన్.. ఈ కాశ్మీర్ సమస్యను చూపించి అనేక విధాలుగా భారత్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించింది.


ఈ సందర్భంగా 1940 లాహోర్ రిజల్యూషన్‌ను కూడా ఎన్‌సీఈఆర్‌టీ ఈ మాడ్యూల్‌లో ప్రస్తావించింది. ఇక హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు గ్రామాలు, సిద్ధాంతాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యానికి చెందిన వారని అప్పట్లో మహమ్మద్ అలీ జిన్నా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. అయితే మొదట బ్రిటిష్ పాలకలు డొమినియన్ స్టేటస్ ఇవ్వడం ద్వారా భారత్‌ను విభజించకుండా ఉంచాలనే ఆలోచన చేసినప్పటికీ.. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని వివరించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్వరలో దీన్ని ప్రింటింగ్ చేసి.. స్కూళ్లలో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.


అంతేకాకుండా ఈ పుస్తకాన్ని 6వ తరగతి నుంచి 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో కలపనున్నట్లు సమాచారం. ఆ పుస్తకంలో జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, లార్డ్ మౌంట్ బాటన్‌ల ఫోటోలు ఉన్నాయి. ఇక రెండు ప్రత్యేక మాడ్యూల్స్‌లో ఈ పుస్తకాన్ని ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించింది. అవి రెండూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 2021లో ‘విభజన గాయాల స్మారక దినం’ జరుపుకుంటున్నట్లు ప్రకటిస్తూ ఇచ్చిన సందేశంతో ప్రారంభం అవుతాయి. దేశ విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని ప్రధాని మోదీ చెప్పిన మాటను ఆ పుస్తకంలో చేర్చారు.


దేశ విభజనపై మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయాలను కూడా ఈ మాడ్యూల్‌లో చేర్చారు. భారత్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా పేలడానికి రెడీగా ఉందని పటేల్ పేర్కొన్నట్టు తెలిపింది. భారత్ యుద్ధభూమిగా మారనున్న తరుణంలో అంతర్యుద్ధానికి దారితీయడానికి బదులు విభజన జరగడమే మేలని పటేల్ అభిప్రాయపడ్డారని పేర్కొంది. దేశ విభజనలో పాలుపంచుకునేందుకు గాంధీ ఇష్టపడనప్పటికీ.. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఆయన ఆపలేకపోయారని తెలిపింది. దేశ విభజనకు నెహ్రూ, పటేల్ అంగీకరించడంతో.. 1947 జూన్ 14వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీని ఒప్పించినట్లు వివరించింది. ఎన్‌సీఈఆర్‌టీ ఇచ్చిన రెండు మాడ్యూల్స్‌లో ఒకటి 6 నుంచి 8 తరగతలకు.. మరొకటి 9 నుంచి 12వ తరగతులకు వర్తింపజేయనున్నారు.


అయితే ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన మాడ్యూల్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. చరిత్రలో జరిగిన విషయాలు తెలపకుండా.. చరిత్రంను వక్రీకరించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోని సెక్యులరిజాన్ని నిర్మూలించాలని చూస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ఈ దేశానికి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. మరోవైపు.. గతేడాది కూడా 9 నుంచి 12వ తరగతులకు సంబంధించిన సిలబస్‌లో అనేక అంశాలను ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది. ఈ తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌.. విద్యార్థులకు అసలైన చరిత్ర తెలియకుండా.. సిలబస్‌ను కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa