ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో భారీగా అబార్షన్లు.. తెలంగాణలో 917 శాతం, ఏపీలో 367 శాతం పెరుగుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 10:47 PM

అబార్షన్ల సంఖ్యకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఏటా అబార్షన్ల సంఖ్య పెరుగుతుండటం.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో అబార్షన్లు జరగడం.. కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో దాదాపు 3 రెట్లు అధికంగా అబార్షన్లు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడి కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్లలో పెరిగిన అబార్షన్లకు సంబంధించి.. తాజాగా కేంద్ర ప్రభుత్వం.. రాజ్యసభకు లెక్కలు వెల్లడించింది. అందులో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో గత 5 ఏళ్లలో ఏకంగా 917 శాతం అబార్షన్లు పెరగ్గా.. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 367 శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.


అబార్షన్లకు సంబంధించి.. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో గణాంకాలు సమర్పించారు. వీటి ప్రకారం.. 2020-21లో తెలంగాణలో జరిగిన అబార్షన్ల సంఖ్య 1,578గా ఉండగా.. 2024-25 నాటికి వచ్చేసరికి ఆ సంఖ్య 16,059కి పెరిగినట్లు చెప్పింది. ఇది ఏకంగా 917 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అయితే దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో గర్భస్రావాలు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. ఇక 2022-23లో 4,071గా ఉన్న అబార్షన్ల సంఖ్య.. 2023-24లో 12,365కి చేరడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.


ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ గత 5 ఏళ్లలో 367 శాతం గర్భస్రావాలు పెరిగిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2020-21లో ఆంధ్రప్రదేశ్‌లో అబార్షన్ల సంఖ్య 2282గా ఉండగా.. 2024-25 నాటికి అది 10,676కు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు.. కేరళలో 2020-2021లో 8525 గర్భస్రావాలు నమోదు కాగా.. 2024-25 వచ్చేసరికి ఆ సంఖ్య 25,884కు ఎగబాకినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


ఇక వైద్య సమస్యలు, అవాంఛిత గర్భాలు, పెరుగుతున్న జీవన వ్యయాలు, డేటా సేకరణలో కచ్చితత్వం, మహిళలు కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో అబార్షన్ల సంఖ్య గత 5 ఏళ్లలో భారీగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఇంత భారీగా గర్భస్రావాలు పెరగడానికి గల కారణాలను పలువురు డాక్టర్లు వెల్లడించారు. చాలా అబార్షన్లు 12 వారాలు పూర్తి కాకముందే జరిగాయని.. పిండం అభివృద్ధి చెందే సమయంలో జన్యుపరమైన, క్రోమోజోములు, పుట్టుకతో వచ్చే అసాధారణ లక్షణాలు వంటి వైద్య సమస్యల వల్ల గర్భస్రావాలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర మాతా శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.కె. సుమిత్ర తెలిపారు.


సరైన గర్భనిరోధక పద్ధతులు పాటించకపోవడం వల్ల కూడా అవాంఛిత గర్భాలు రావడంతో అబార్షన్లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్ సుమిత్ర వెల్లడించారు. ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయాలు కూడా గర్భస్రావాలకు ఒక కారణమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ నిర్ణయాలు తీసుకోవడం.. మొదటి బిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని హైదరాబాద్ అదనపు డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ హేమ్ లత తెలిపారు.


గతంలో చాలా అబార్షన్లు జరిగినా.. వాటి లెక్కలను నమోదు చేయలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అబార్షన్లను పక్కగా నమోదు చేయడం వల్ల అసలైన లెక్కలు బయటికి వస్తున్నాయని పేర్కొంటున్నారు. 2017లో సవరించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ చట్టం ద్వారా అబార్షన్ చేసేందుకు గరిష్ట వయస్సు.. 20 వారాల నుంచి 24 వారాలకు పెంచడంతో అబార్షన్ల సంఖ్య పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరడం.. కెరీర్ ప్లాన్ చేసుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కారణంగా.. అబార్షన్ల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa