ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక రోబోలు కూడా గర్భం దాల్చి, పిల్లల్ని కంటాయి.. రూ.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబోలు

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:25 PM

మాతృత్వం అనేది కేవలం మహిళలకు మాత్రమే తెలుసు. పురుషుడు ఎన్ని చేసినా.. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు పడి.. బిడ్డను భూమి మీదికి తీసుకువచ్చేది మాత్రం అమ్మనే. అందుకే అమ్మతనానికి మించింది లేదు అని అంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకూ ఊహించని రీతిలో డెవలప్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మనుషులు చేయలేని పనులను సైతం చేసేలా.. సైంటిస్ట్‌లు రోబోలను రూపొందిస్తున్నారు. అందులో కొన్ని విఫలం అవుతున్నప్పటికీ.. భవిష్యత్ అంతా రోబోటిక్స్ రంగానిదే అని నిపుణులు చెబుతున్నారు. ఇక రోబోలు, వాటి టెక్నాలజీకి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన రోబో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో రోబో అయిన రజినీకాంత్.. తాను హీరోయిన్‌తో కలిసి పిల్లలను కనే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయగలనని చెబుతాడు. అయితే తాజాగా ఓ చైనా కంపెనీ మాత్రం.. దాన్ని నిజం చేసి చూపిస్తామంటోంది.


చైనాలోని కైవా టెక్నాలజీ సంస్థ.. హ్యూమనాయిడ్ రోబోలకు కృత్రిమ గర్భాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టును శరవేగంగా చేస్తున్నట్లు ఆ కంపెనీ ఫౌండర్ డాక్టర్ ఝాంగ్ క్విఫెంగ్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవల వరల్డ్ రోబో కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఝాంగ్ క్విఫెంగ్.. 2026 నాటికి రోబోలు బిడ్డలకు జన్మనిచ్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇది రోబోలకు కృత్రిమ గర్భాన్ని అమర్చి.. గర్భధారణను పూర్తి చేసే ఒక సరికొత్త వ్యవస్థ అని తెలిపారు. మనుషుల గర్భధారణ ప్రక్రియ ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఈ హ్యూమనాయిడ్ రోబోల ప్రెగ్నెన్సీ ఉంటుందని తెలిపారు. 2026 నాటికి ఈ రోబో ప్రోటోటైప్ సిద్ధం అవుతుందని.. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడేవారికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా ఉంటుందని వెల్లడించారు.


 ఇప్పటివరకు సినిమాల్లోనే ఇలాంటివి చూస్తున్నామని.. కానీ ఇక నుంచి రోబోలు కూడా మనుషులకు ప్రాణం పోయగలవు అంటూ డాక్టర్ ఝాంగ్ క్విఫెంగ్.. తన ప్రాజెక్టు గురించి వివరించారు. రోబో శరీరంలోనే కృత్రిమ గర్భాన్ని ఏర్పాటు చేసి.. గర్భధారణ ప్రక్రియను ఈ సరికొత్త టెక్నాలజీ పూర్తి చేస్తుందని వెల్లడించారు. ఇక ఈ కృత్రిమ గర్భం కూడా సాధారణ మహిళ గర్భం దాల్చితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని తెలిపారు. ఈ గర్భంలో పిండం అభివృద్ధి చెందడానికి అవసరమైన కృత్రిమ అమ్నియోటిక్ ద్రవం, పోషకాలను అందించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టేవరకు మొత్తం ఇది 10 నెలల ప్రక్రియ అని తెలిపారు.


ఒకవేళ ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే.. రోబోటిక్స్ రంగంలోనే కాకుండా, వైద్య రంగంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదుర్కొంటున్న సంతాన లేమి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యలు.. పిల్లలకు వచ్చే జన్యుపరమైన లోపాలు, తల్లి-బిడ్డ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఇది ఒక అవకాశాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు.


ఈ పిల్లలను కనే హ్యూమనాయిడ్ రోబో ప్రోటోటైప్‌ను 2026లో రిలీజ్ చేయనున్నట్లు కైవా టెక్నాలజీ సంస్థ తెలిపింది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుందని ప్రకటించింది. ఈ రోబో ప్రోటోటైప్ ధర సుమారు లక్ష యువాన్లు అంటే మన భారత కరెన్సీలో సుమారుగా రూ.12.16 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సరోగసీ వ్యవస్థలో పిల్లలను కనడంతో పోల్చితే ఇది తక్కువ ధరలో అయిపోతుందని చెబుతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులకు ఇది ఒక వరంగా భావిస్తున్నారు. ఇక సరోగసీ వ్యవస్థతో పోలిస్తే.. ఇది మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.


రోబోలకు కృత్రిమ గర్భం అనేది చాలా ఆసక్తికరంగా, ఆశాజనకంగా అనిపిస్తున్నప్పటికీ.. ఇది నైతికంగా, చట్టపరంగా అనేక అంశాలపై సరికొత్త చర్చకు దారితీస్తోంది. రోబోల ద్వారా పుట్టిన బిడ్డలకు ఉండే హక్కులు, వారి పెంపకం వంటి వాటిపై చైనా ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ ప్రక్రియను.. మనుషులకు బాధ్యతాయుతంగా ఉపయోగపడేలా స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ క్విఫెంగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa