ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంటు లేక, డోర్లు తెరుచుకోక 782 మంది ఉక్కిరిబిక్కిరి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 05:17 PM

ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా.. 2 మోనో రైళ్లు కూడా మొరాయించి ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ అయింది. ఫలితంగా రెండు మోనో రైళ్లు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. గంటల పాటు రైల్లో కరెంటు లేక ఏసీలు కూడా పని చేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. కనీసం గాలి కూడా ఆడకపోవడంతో.. అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే విషయం గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. రైళ్ల కిటికీ అద్దాలు పగులగొట్టి మరీ 782 మంది ప్రయాణికులను కాపాడారు.


ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 6.15 గంటల సమయంలో మైసూర్ కాలనీ-భక్తి పార్క్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ దీనికి గల కారణాలను స్పష్టం చేసింది. సాధారణంగా ఒక మోనోరైలు 104 మెట్రిక్ టన్నుల బరువును మోసే విధంగా రూపొందించబడింది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు రైలులో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడంతో దాని బరువు 109 టన్నులకు చేరుకుంది. ఈ అదనపు బరువు కారణంగా.. పవర్ రైలు, కరెంట్ కలెక్టర్ మధ్య ఉండే యాంత్రిక సంబంధం విరిగిపోయింది. దీనితో రైలుకు విద్యుత్ సరఫరా ఆగిపోయి, రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది.


భారీ వర్షాల కారణంగా సబర్బన్ రైల్వే హార్బర్ లైన్ సేవలు నిలిచిపోవడమే ప్రయాణికుల రద్దీకి ప్రధాన కారణమని MMRDA అధికారులు పేర్కొన్నారు. రైలు ఆగిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు లోపల ఉక్కపోత, భయం కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది సొమ్మసిల్లిపోయారు. వారిలో ఒకరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు ఆగిపోయిన వెంటనే, సాంకేతిక నిపుణులు రైలును టో చేసి తిరిగి స్టేషన్‌కు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ బరువు ఎక్కువగా ఉండటం వల్ల వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింపారు.


దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అగ్నిమాపక బృందాలు రైలు కిటికీలను జాగ్రత్తగా పగలగొట్టి.. ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు. మొదటి రైలులో ఉన్న 582 మందిని స్నోర్కెల్ నిచ్చెనల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. కాగా రెండో రైలులో ఉన్న 200 మందిని విజయవంతంగా వడాల స్టేషన్‌కు తిరిగి తీసుకు రాగలిగారు. ఈ సంఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa