డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, డబ్బులతో ముడిపడిన గేములపై నియంత్రణ అవసరమైందని భావించిన కేంద్ర ప్రభుత్వం, ఈ రంగాన్ని కట్టడి చేయడానికి నిర్ణాయక చర్య తీసుకుంది. 'ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025' పేరిట ఒక కీలక బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లును కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గత బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఈ బిల్లుకు ఎటువంటి వ్యతిరేకత లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. ఈ బిల్లులో డబ్బుతో జరిపే ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం విధించడంతో పాటు, ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించే, నియంత్రించే విధానాలకు మార్గదర్శకత్వం కల్పించనుంది.
రాజ్యసభలో కూడా ఇదే రోజున బిల్లు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఈ నిర్ణయంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ప్రభుత్వ ఆధిక్యం వల్ల చర్చ జరగకుండానే బిల్లు ఆమోదించబడింది. ఇది పార్లమెంట్‌లో చర్చ అవసరమని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నప్పటికీ, కేంద్రం మాత్రం తక్షణ చర్యలే అవసరమని ధీమా వ్యక్తం చేసింది.
ఈ బిల్లు అమల్లోకి వస్తే, డబ్బుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. యువతపై ఈ గేమ్స్ చూపుతున్న దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ చట్టం, గేమింగ్ రంగానికి స్పష్టమైన నియంత్రణలతోపాటు భద్రతా ప్రమాణాలను అమలు చేసే దిశగా కీలకంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa