చెడు కొలెస్ట్రాల్ గుండెకి మంచి కాదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే కొలెస్ట్రాల్‌ని నియంత్రించుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని కూరగాయల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వు అధికంగా ఉండే ఆహారం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రెట్ మీట్, నెయ్యి, వెన్న, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, చిప్స్, కుకీలు, కేకులు, అధిక చక్కెర, స్వీట్స్ వంటివి తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. చెడు ఆహారంతో పాటు శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించకపోతే, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది ధమనుల్లో ఫ్లేక్లా ఏర్పడుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్, రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. అందుకే జీవనశైలి, ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే కొన్ని కూరగాయల్ని డైట్లో యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలు కొలెస్ట్రాల్‌కి ఔషధంలా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను కాపాడే ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోడ కాకరకాయ
బోడ కాకరకాయని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీన్ని ఆకాకర లేదా అడవి కాకర అని కూడా పిలుస్తారు. ఈ కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో అదనపు LDL కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సాయపడుతుంది. ఈ కూరగాయలో కొలెస్ట్రాల్ సున్నా. అంతేకాకుండా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉన్న ఈ కూరగాయ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలో మంట, వాపు తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. దీంతో, గుండె జబ్బుల్ని నివారించడంలో సాయపడుతుంది.
బుడంకాయ (పొటల్స్)
బుడంకాయ లేదా పొటల్స్ తిన్నా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పొటల్స్లో కరిగే ఫైబర్ ఎక్కుగవా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఈ కూరగాయలో తక్కువ కేలరీలు, జీరో కొలెస్ట్రాల్ ఉన్నాయి. దీంతో, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉన్న బుడంకాయ తినడం వల్ల ధమనుల్లో ప్లేక్ ఏర్పడదు. దీంతో, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
బెండకాయ
బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. బెండకాయలో విటమిన్ సి,కె, ఫోలెట్, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, విటమిన్ బి వంటి పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. అంతేకాకుండా కరిగే ఫైబర్ పెక్టిన్ ఉంటుంది. ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సాయపడుతుంది. ఈ ఫైబర్ కొలస్ట్రాల్‌ను గ్రహించే ముందు బంధిస్తుంది. అంతేకాకుండా బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల్ని నివారించడానికి బెండకాయను క్రమం తప్పకుండా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
సొరకాయ
చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సొరకాయ మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. సొరకాయ తినడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు, అదనపు కొవ్వు తొలగిపోతుంది. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనుల్ని శుభ్రంగా ఉంచుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సొరకాయ కూర లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
కాకరకాయ
రుచిలో చేదుగా ఉండే కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాకరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్, విటమిన్ సి, జింక్, పొటాషియం వంటివి లభిస్తాయి. కాకరకాయలో లభించే ఫైటో కెమికల్స్, కరిగే ఫైబర్ ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండూ శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిల్ని తగ్గిస్తాయి. దీంతో మంట, వాపు తగ్గుతుంది. అంతేకాకుండా గుండె జబ్బుల్ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాకరకాయలో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa