ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రింకూ సింగ్

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 09:05 AM

టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్, ఓ పాకిస్థాన్ అభిమానిపై తాను ప్రదర్శించిన ఆగ్రహానికి గల అసలు కారణాన్ని తాజాగా వెల్లడించాడు. కేవలం వైరల్ కంటెంట్ సృష్టించాలనే దురుద్దేశంతోనే ఆ అభిమాని తమను రెచ్చగొట్టేలా ప్రశ్నలు అడిగాడని, అందుకే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, దాని వెనుక ఉన్న పూర్తి విషయాన్ని రింకూ ఇప్పుడు వివరించాడు.2024లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లను కలిసిన ఓ పాకిస్థాన్ అభిమాని, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించాడు. ఆ సమయంలో అతడు తన కెమెరాను ఆన్‌లో ఉంచి వారి స్పందనను రహస్యంగా రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్యకుమార్ చిరునవ్వుతో ఆ ప్రశ్నను దాటవేయగా, రింకూ సింగ్ మాత్రం తీవ్రంగా స్పందించాడు. "వీడియో బంద్ కరో ఆప్ దయచేసి కెమెరా ఆపండి అంటూ అభిమానిని గట్టిగా హెచ్చరించాడు.ఇటీవల ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటనపై రింకూ మాట్లాడుతూ.. "ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చి కెమెరా ఆన్ చేసి వింత ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. మా నుంచి ఏదో ఒక స్పందన రాబట్టి, దాన్ని వైరల్ చేయాలన్నదే అతని ఉద్దేశం. అది గమనించి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే వెంటనే కెమెరా ఆపమని చెప్పాను. చివరికి మా మాట విని అతను రికార్డింగ్ ఆపేశాడు" అని వివరించాడు.భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2006 తర్వాత టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. సెప్టెంబర్ 14న జరిగే తొలి మ్యాచ్‌తో పాటు, టోర్నీలో ఫైనల్ వరకు ఇరు జట్లు ప్రయాణిస్తే మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa