కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓ సినిమా నటి.. తనను ఓ యువ ఎమ్మెల్యే వేధించాడని ఆరోపణలు చేయగా.. బీజేపీ సదరు వ్యక్తి పేరును వెలుగులోకి తెచ్చింది. నటిని వేదించింది ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్ అంటూ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయగా ఆయన కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు అన్ని పార్టీ పదవుల నుంచి రాజీనామా చేశారు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన మరో ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. అందులో ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్ ఓ మహిళను బెదిరించాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించుకోమంటూ వేధించాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఆడియో క్లిప్‌లో ఏముందంటే..?
రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లో ఒక మహిళ, ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్ మధ్య జరిగిన సంభాషణగా తెలుస్తోంది. అందులో మహిళ.. నా అనుమతి లేకుండానే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావేంటి అని అడగడంతో ప్రారంభం అవుతుంది. దీనికి ఎమ్మెల్యే.. నా అనుమతి గురించి కాదు, అసలీవిషయం గురించే మీరు ఆలోచించడం మానేస్తే మంచిదని, దీని పరిణామాలు మీకు తెలియవని చెబుతారు. కానీ ఆమె మాత్రం ఎలాంటి పరిణామాల్ని అయినా నేను ఎదుర్కుంటానని అంటుంది.
నువ్వు ఒంటరిగా ఎదుర్కోలేవు, నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసని ఎమ్మెల్యే బెదిరించాడు. ఆ గర్భమే నీ జీవితాన్ని నాశనం చేస్తుందని కూడా హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా చెప్పినట్లు వినకపోతే మిమ్మల్ని చంపేందుకు కూడా నేను వెనుకాడనని.. దానికి నాకు కొన్ని సెకన్లు మాత్రమే పడుతుందంటూ వివరిస్తాడు. నేనిప్పటికే నీతో ప్రశాంతంగా మాట్లాడుతున్నానని.. చెబుతాడు. దానికి ఆమె నాకు బిడ్డ పుడితే మీరేం చేస్తారని అనగా.. అబార్షన్ చేయించుకోమంటాడు. బిడ్డ పుడితే మీరు చంపేస్తారు, నా బిడ్డను మీకు దొరకనివ్వను, నేనొక్క దాన్నే చక్కగా పెంచుకుంటానని మహిళ చెబుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఎమ్మెల్యే అంటాడు. ఇక్కడితో ఈ ఆడియో అయిపోయింది.
అయితే ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేరళ బీజేపీ నాయకులు, అధికార పార్టీ కాంగ్రెస్‌ను ముఖ్యంగా రాహుల్ మామ్‌కూటథిల్ రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ దారుణమైన ఘటనపై స్పందించి.. ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పాలక్కడ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధి అయ్యుండి.. ఓ మహిళ పట్ల అది కూడా ఒక గర్భిణీ పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరించడం దారుణమని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
తనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలపై ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్ కూడా స్పందించారు. ఈ ఆడియో క్లిప్ తాను మాట్లాడింది కాదని, ఎవరో కావాలనే సృష్టించారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేస్తున్న ఏ మహిళ కూడా ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేస్తే.. తాను కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలనని చెప్పారు. ఈ కేసులో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ ఆరోపణలు తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు చేసిన కుట్రలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa