దశాబ్దాల పాటు ఉద్రిక్తతలు, చారిత్రక వైరుధ్యాలతో దూరంగా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్త దిశగా పయనిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్‌లో జరిపిన చారిత్రక పర్యటన ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 13 ఏళ్ల తర్వాత పాక్ విదేశాంగ మంత్రి స్థాయిలో జరిగిన ఈ ఉన్నత స్థాయి పర్యటనలో.. ఇరు దేశాల మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. మరి ఆ ఆరు ఒప్పందాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించిన తర్వాత నుంచి పాకిస్థాన్.. బంగ్లాతో చేతులు కలుపుతోంది. ముఖ్యంగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం వదిలి ఇండియాకు వచ్చి ప్రస్తుతం ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత షేక్ హసీనాను వారి దేశానికి తిరిగి పంపించమంటూ గొడవ చేస్తున్నారు. ఇలా భారత్-బంగ్లా సంబంధాలు క్షీణించగా.. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌తో బంధాన్ని మరింత బలపరుచుకుంది. అందులో భాగంగానే తాజాగా ఆరు కీలక ఒప్పందాలు చేసుకుంది. అందులో మొదటిది దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులకు వీసా రహిత ప్రయాణానికి సంబంధించిన ఒప్పందం. ఇది రెండు దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా అధికారిక స్థాయిలో పరస్పర అవగాహనను, నమ్మకాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
ఈ ఒప్పందాలతో పాటు మరో ఐదు కీలకమైన ఒప్పందాలు కూడా జరిగాయి. అందులో వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఒక ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేయడానికి, వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. అలాగే దౌత్య శిక్షణ, విద్యా సంబంధిత మార్పిడి కార్యక్రమాలకు సంబంధించి కూడా రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. పాకిస్థాన్-బంగ్లాదేశ్ విదేశాంగ సేవా అకాడమీల మధ్య సహకారం, అలాగే ఇరు దేశాల వార్తా సంస్థలైన "అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ కార్పొరేషన్", "బంగ్లాదేశ్ సాంగ్బాద్ సాంగ్స్థా"ల మధ్య సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రజలకు సమాచారాన్ని మరింత పారదర్శకంగా అందించే అవకాశం ఉంది.
ఈ చారిత్రక పర్యటనలో పాకిస్థాన్ మరో కీలక ప్రకటన చేసింది. "పాకిస్థాన్ -బంగ్లాదేశ్ నాలెడ్జ్ కారిడార్" పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద రాబోయే ఐదేళ్లలో బంగ్లాదేశ్ విద్యార్థులకు పాకిస్థాన్‌లో ఉన్నత విద్య అభ్యసించడానికి 500 స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. ఇందులో 25 శాతం వైద్య విద్య కోసం కేటాయించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌కు చెందిన 100 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ చర్యలు యువత మధ్య బంధాన్ని పెంచడానికి, సాంస్కృతిక అవగాహనను మెరుగుపరచడానికి దోహదపడతాయి.
అయితే ఈ సానుకూల పరిణామాల మధ్య చారిత్రక విభేదాలు పూర్తిగా తొలగిపోలేదనే విషయం స్పష్టమైంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన సంఘటనలను మరిచిపోయి, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కానీ బంగ్లాదేశ్ అధికారులు దీనిపై ఏకీభవించలేదు. 1971లో జరిగిన మారణకాండకు పాకిస్థాన్ అధికారికంగా క్షమాపణ చెప్పాలని.. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపిణీ సమస్యను పరిష్కరించాలని బంగ్లాదేశ్ పట్టుబట్టింది. ఈ అంశం కూడా చర్చల సమయంలో కూడా ప్రస్తావనకు వచ్చిందని.. అయినప్పటికీ రెండు దేశాలు భవిష్యత్తు కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa