ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గో సంరక్షణ, గ్రామీణాభివృద్ధి కోసం చేతులు కలిపిన పతంజలి, యూపీ గోసేవా కమిషన్

national |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 05:29 PM

 గో సంరక్షణ, గో ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉత్తర ప్రదేశ్ గో సేవా కమిషన్, ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి చేతులు కలిపాయి. ముఖ్యంగా కమిషన్ ఛైర్మన్ శ్యామ్ బిహారీ గుప్తా, యోగా గురువు బాబా రాందేవ్, పతంజలి సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణల మధ్య హరిద్వార్‌లో జరిగిన చర్చ తర్వాత ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ కీలక సహకారం ద్వారా గోవుల సంరక్షణకు ఆర్థికంగా తోడ్పడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం గోవుల ప్రాధాన్యతను పెంచడానికి, గో ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌ను సృష్టించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


గ్రామాభివృద్ధికి ఆవు ఆధారం అని చెప్పే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ పథకాన్ని ఆమోదించారు.ఈ భాగస్వామ్యంలో పతంజలి ఆయుర్వేద్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తి అభివృద్ధిలో ఉన్న నైపుణ్యాన్ని యూపీ గో సేవా కమిషన్‌కు అందిస్తుంది. ముఖ్యంగా ఆవు పేడ (గోబర్), ఆవు మూత్రం (గోమూత్రం) ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంలో ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. ఈ పథకంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోన 75 జిల్లాల్లో ప్రతి జిల్లాలో రెండు నుంచి 10 గోసంరక్షణా కేంద్రాలను పెద్ద మోడల్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తారు. ఇవి పరిరక్షణ కేంద్రాలుగా మాత్రమే కాకుండా గ్రామీణ పరిశ్రమ కేంద్రాలుగా కూడా పని చేస్తాయి.


ముఖ్యంగా పంచగవ్వ ఉత్పత్తి, బయోగ్యాస్‌ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. పశువుల స్వేచ్ఛా కదలికలను అనుమతించడానికి ఓపెన్ షెడ్‌లు, కంచెలు మరియు భద్రతా ఏర్పాట్లు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ స్థాయిలో ఉద్యోగాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఆవు మూత్రం సేకరణ, అమ్మకంతో గ్రామస్థులకు 50 శాతం కమిషన్ ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తోంది. శిక్షణ, నాణ్యత తనిఖీ, సూత్రీకరణ, ధ్రువీకరణ, లైసెన్సిగ్ వంటి వాటన్నింటినీ పతంజలి చూసుకుంటుంది.కార్యకలాపాల ఆధునీకరణ కోసం జియో ఫెన్సింగ్, ఆవు ట్యాగింగ్, ఫొటో మ్యాపింగ్, మేత జాబితా ట్రాకింగ్ వంటి సాంకేతికతలను ఆశ్రయాల్లో ఉపయోగించనున్నారు.


వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి, నేల సారాన్ని మెరుగు పరచడానికి, పర్యావరణ స్థిరత్వాన్ని పెంచడానిక వేప, ఆవు మూత్రం, వర్మీ కంపోస్ట్ వంటి వాటని గ్రామాలకు అందిస్తారు. యూపీ గో సేవా కమిషన్ ఛైర్మన్ శ్యామ్ సింగ్ డాంగి ఈ సహకారం గురించి మాట్లాడుతూ.. "పతంజలి వంటి సంస్థతో మా ఒప్పందం గోవులను రక్షించడంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఇది కేవలం గో సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు, గోవులను ఉపయోగించి ఒక సమగ్రమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కూడా సహాయ పడుతుంది" అని తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా గో ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమకు భారీ ప్రోత్సాహం లభిస్తుందని.. దీని ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.


పతంజలి ఆయుర్వేద్ ఛైర్మన్ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. తమ సంస్థ ఈ భాగస్వామ్యం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పారు. "గోవుల ప్రాముఖ్యతను మేం మొదటి నుంచి నమ్ముతున్నాం. ఈ ఒప్పందం ద్వారా ఆవు పేడ, మూత్రం నుంచి ఎరువులు, క్రిమిసంహారకాలు, ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులు వంటి వాటిని తయారు చేయడానికి పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేస్తాం. ఇది గోశాలలకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచుతుంది" అని ఆయన వివరించారు. పతంజలికి ఉన్న విస్తృతమైన మార్కెటింగ్ నెట్‌వర్క్ ఈ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి, విక్రయించడానికి సహాయ పడుతుందని తెలిపారు.


ఈ భాగస్వామ్యం పెట్టుకున్న ప్రణాళికలు విజయవంతం అయితే.. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచి, గో ఆధారిత ఆర్థిక వ్యవస్థకు దేశవ్యాప్తంగా కొత్త ఊపును తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయత్నం గోసంరక్షణకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుందని, తద్వారా పవిత్రంగా భావించే గోమాతను ఆర్థికంగా కూడా ముఖ్యమైనదిగా నిరూపించగలదని అందరూ ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa