రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ దేశ జనాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా క్షీణతను నివారించి, దేశ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రతి భారతీయ జంట ముగ్గురు పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన "100 వర్ష్ కీ సంఘ్ యాత్ర" కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ సూచన చేశారు.సంతానోత్పత్తి రేటు మూడు కంటే తక్కువగా ఉన్న సమాజాలు క్రమంగా అంతరించిపోతాయని నిపుణులు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. "మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది సగటు లెక్కల్లో బాగానే ఉన్నా, ఆచరణలో 0.1 బిడ్డకు జన్మనివ్వడం సాధ్యం కాదు కదా అందుకే రెండు తర్వాత మూడో బిడ్డ తప్పనిసరి అవుతుంది" అని ఆయన వివరించారు.సరైన వయసులో వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కంటే తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తనకు వైద్యులు చెప్పినట్లు భగవత్ తెలిపారు. అంతేకాకుండా, ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఇంట్లో పిల్లలకు అహం అదుపులో ఉంటుందని, భవిష్యత్తులో వారి కుటుంబ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని ఆయన అభిప్రాయపడ్డారు.దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి జంట ముగ్గురు పిల్లల లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఆయన కోరారు. అయితే, జనాభా అదుపు తప్పకూడదని కూడా హెచ్చరించారు. "జనాభా ఒక వరం, కానీ అదే సమయంలో భారం కూడా కావచ్చు. అందరికీ ఆహారం అందించాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో ఉంటూనే, తగినంత సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ప్రతి కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఉండాలి, అంతకుమించి మరీ ఎక్కువగా వద్దు. అప్పుడే వారి పెంపకం కూడా సరిగ్గా ఉంటుంది" అని భగవత్ నొక్కిచెప్పారు.ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ జననాల రేటు తగ్గుతోందని, అయితే హిందువుల్లో ఇది మొదటి నుంచి తక్కువగా ఉండటంతో మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. వనరులు తగ్గి, జనాభా పెరిగినప్పుడు ప్రకృతి సహజంగానే ఇలా చేస్తుందని, ఈ వాస్తవికతకు యువతరాన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని భగవత్ పేర్కొన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ, మతమార్పిడులు, అక్రమ వలసలతోనే అసలు సమస్య వస్తోందని అన్నారు. అక్రమ వలసదారులకు మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. ఉపాధి విషయంలో మన దేశానికి చెందిన ముస్లింలను కూడా కలుపుకుని వెళ్లాలని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa