సాధారణంగా ఇళ్లు, భవనాలు, ఆఫీసులు, విద్యాసంస్థలు వంటి వాటికి కాపలా కోసం సెక్యూరిటీని నియమిస్తారు. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉంటే పోలీసులను కూడా రంగంలోకి దింపుతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇందుకు పూర్తిగా భిన్నమైన సంగతి. యూనివర్సిటీకి కాపలాగా కొండ ముచ్చును నియమించారు. వర్సిటీకి కొండ ముచ్చు కాపలా ఏంటి అనుకుంటున్నారా.. ఇదేక్కడి విడ్డూరమని ఆశ్చర్యపోయినా సరే.. ఇది మాత్రం వాస్తవంగా జరుగుతున్న సంఘటన. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని ఆచ్చార్య నాగార్జున యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందరో గొప్ప గొప్ప వాళ్లు ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. అత్యుత్తమ బోధనతో విద్యార్థుల జీవితాలను తీర్చే దిద్దే ఈ వర్సిటీలో 20 ఏళ్లకు పైగా ఓ వింత అలవాటు కొనసాగుతూ వస్తోంది. అదే కొండముచ్చు కాపలా. దేవయ్య అనే వ్యక్తి గత 23 ఏళ్లుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కొండముచ్చును తీసుకు వస్తున్నారు. ఎందుకంటే.. కోతుల బెడద లేకుండా చేయడం కోసం.
23 ఏళ్ల క్రితం అనగా 2002లో ఆచార్య నాగార్జున వర్సిటీలో పెద్ద సంఖ్యలో కోతులు ఉండేవి. క్లాస్ రూములు, హాస్టల్, డైనింగ్ హాల్.. ఇలా ప్రతి చోటా వందల సంఖ్యలో కోతులు వచ్చి.. విద్యార్థులను బెంబేలెత్తించేవి. పైగా స్టూడెంట్స్ భోజనం చేసే సమయానికి కోతులు గుంపులు గుంపులుగా వచ్చి.. విద్యార్థుల మీద దాడి చేస్తూ.. వారిని భోజనం చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాక ఆహారాన్ని కూడా వృథా చేసేవి. ఒకానొక సందర్భంలో కోతులకు భయపడి.. ఈ యూనివర్సిటీలో చేరాలంటే విద్యార్థులు భయపడ్డారు.
సమస్య తీవ్ర రూపం దాల్చడంతో.. కోతులను పారదోలే బాధ్యతలను వర్సిటీలో పని చేసే దేవయ్యకు అప్పగించారు. దీంతో దేవయ్య ఒక కొండముచ్చును తీసుకువచ్చి.. దాన్ని మచ్చిక చేసుకుని.. వర్సిటీలో తిప్పడం ప్రారంభించారు. కొండముచ్చును చూసి కోతులు భయంతో పరారయ్యేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 23 ఏళ్లుగా దేవయ్య.. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో తన సైకిల్ మీద కొండముచ్చును ఎక్కించుకుని వర్సిటీ అంతా తిరుగుతూ.. కోతులను తరిమికొడుతున్నారు.
ఇప్పటి వరకు దేవయ్య రెండు కొండముచ్చులను చేరదీసి.. వాటి సాయంతో కోతులను తరిమే బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అవి రెండు చనిపోయాయి. ఇప్పుడు మూడో కొండముచ్చును తీసుకొచ్చారు. దీన్ని కూడా ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వర్సిటీలో తిప్పుతూ కోతులను బెదరగొడుతుంటారు. వర్సిటీకి ఇలా కొండముచ్చును కాపలాగా పెట్టడం మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది అంటున్నారు. అయితే సమస్యను బట్టే పరిష్కారం.. కోతులను భయపెట్టాలంటే కొండముచ్చు రావాల్సిందే అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa