ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమించినోళ్లను అర్దాంతరంగా వదిలేస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఏంటి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 08:32 PM

అనుకోకుండా ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి, యువకుడు.. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. భవిష్యత్తు గురించి యువతి అందమైన కలలు కంది. ప్రేమలో సమయం హాయిగా సాగిపోతున్న తరుణంలో.. ప్రియుడు అకస్మాత్తుగా మాయమైపోయాడు. మెసేజ్ లేదు, కాల్ లేదు. ఏమైందో, ఎక్కడున్నాడో, ఎందుకిలా చేశాడో తెలియదు. ఇలా సమాధానాలు తెలియని ప్రశ్నలు ఆ యువతిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలా కొద్ది రోజులు గడిచాక ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది.. ప్రియుడు కులాసాగానే ఉన్నాడని. ఒక్కసారిగా ఆ యువతికి దిమ్మతిరిగిపోయింది. అప్పుడు అర్థమైంది.. అతడు కావాలనే తనను దూరం పెట్టాడని. ఇలా చెప్పాపెట్టకుండా 


ఇలా చేసినవాళ్ల సంగతేంటో గానీ.. దీని బారిన పడినవారు మాత్రం వర్ణించలేని వేదన అనుభవిస్తున్నారట. ఈ ఘోస్టింగ్ ఎన్నిరకాలుగా జరుగుతోంది? ఇది బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దీని వల్ల మనిషి జీవితంలో జరుగుతున్న నష్టాలేంటి? అనే విషయాలపై కీలక వివరాలు..


ఘోస్టింగ్ ఎన్ని రకాలుగా జరుగుతోంది?


డేటింగ్ ఘోస్టింగ్, ఫ్రెండ్‌షిప్ ఘోస్టింగ్, వర్క్‌ప్లేస్ ఘోస్టింగ్, ఫాంటమ్ , క్యాస్పర్ ఘోస్టింగ్ .. అంటూ అనేక రకాల ఘోస్టింగ్‌లు ఉన్నాయి. అయితే, పేర్లు ఏవైనా.. చెప్పా పెట్టకుండా కనెక్షన్, కమ్యూనికేషన్ కట్ చేయడమే ఘోస్టింగ్. వర్క్‌ప్లేస్ ఘోస్టింగ్‌లో.. ఇంటర్వ్యూకి పిలిచిన అభ్యర్థులకు నియామకం స్టేటస్ గురించి చెప్పకపోవడం లేదా కంపెనీల్లోంచి చెప్పా పెట్టకుండా ఉద్యోగులు వెళ్లిపోవడం, జాబ్ ఆఫర్లకు రిప్లై ఇవ్వకపోవడాన్ని వర్క్‌ప్లేస్ ఘోస్టింగ్ అంటున్నారు. ఫాంటమ్ గోస్టింగ్‌లో అకస్మాత్తుగా కాకుండా.. క్రమంగా ముఖం చాటేస్తున్నారట. ఇక క్యాస్పర్ లేదా పొలైట్ ఘోస్టింగ్‌లో చిన్న చిన్న కారణాలు చెప్పి వదిలించుకుంటున్నారట. డేటింగ్‌, ఫ్రెండ్‌షిప్‌లలో ఇది ఎక్కువగా జరుగుతోంది.


ఘోస్టింగ్ వల్ల నష్టాలేంటి?


ఘోస్టింగ్ చేసిన వాళ్లు ఏమనుకున్నారో, ఏ కారణాలు ఉన్నాయో తెలియదు గానీ.. ఘోస్టింగ్‌కు గురైనవారు మాత్రం మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సన్నిహితులు సడెన్‌గా ఇలా ఎందుకు చేశారనే ప్రశ్నలు.. బాధితులను ఉన్న చోట ఉండనివ్వడం లేదు. భయాందోళనకు గురవుతూ.. వారిని వారే సందేహించుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆలోచిస్తూ మతి పోగొట్టుకుంటున్నారని అంటున్నారు.


ఈ చేదు అనుభవం వల్ల వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు, స్నేహితులు, కొలీగ్స్.. తదితర బంధాలకు దూరం అవుతున్నవారూ ఉన్నారు. అంతేకాకుండా.. మళ్లీ కొత్త రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెట్టాలంటే కూడా భయాందోళనకు గురవుతున్నారట. ఘోస్టింగ్.. బాధితుల ప్రొఫెషనల్ లైఫ్‌నూ దెబ్బతీస్తోందని నిపుణులు చెబుతున్నారు.


బంధాలపై ఘోస్టింగ్ ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?


ఘోస్టింగ్ బాధితులకు నష్టం.. వారు ఉన్న రిలేషన్‌షిప్ లోతును బట్టి ఉంటుంది. పరిచయమైన కొద్ది రోజులకే ఇలా చేస్తే.. లైట్ తీసుకుంటారు. కానీ, బంధం బలపడిన తర్వాత ఘోస్టింగ్ చేస్తే తట్టుకులేకపోతున్నారట మోడర్న్ మృదుస్వభావులు. అయితే, ప్రస్తుత జరనేషన్‌లో ఈ ఘోస్టింగ్ సర్వసాధారణమైపోయింది. కానీ, ఇది మంచి పరిణామం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఘోస్టింగ్ చేయడం అనేది.. ఒక వ్యక్తిని పూర్తిగా విస్మరించడమని, ఇది మానవత్వానికి విరుద్ధమైనది, అగౌరవపరిచే చర్య అని చెబుతున్నారు.


సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఎక్కువగా ఘోస్టింగ్ జరుగుతోందట. ఈ ఘోస్టింగ్ ఉదంతాలు ఎక్కువైన నేపథ్యంలో.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వ్యక్తిని అలా చేసే హక్కు ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఇలా చేసినవాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్‌లు కూడా వినిపిస్తున్నాయి.


భారత్‌లో.. ఘోస్టింగ్ చేస్తే క్రిమినల్ కేసు!


ఘోస్టింగ్‌ను క్రిమినల్ చర్యగా భావించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. 2022లో జులైలో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ చట్టసభ సభ్యుడు ఆర్నోల్ఫో టీవ్స్ జూనియర్.. ఘోస్టింగ్‌ను ఎమోషనల్ క్రూయెల్టీగా అభివర్ణించారు. దీన్ని ఇల్లీగల్ చర్యగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శరీరానికి దెబ్బ తగిలితే ఎలా నొప్పి వస్తుందో.. ఘోస్టింగ్‌కు గురైనవారు కూడా మానసికంగా మైండ్‌లో అలాంటి బాధనే అనుభవిస్తారని వాదించారు. ఎమోషనల్ అబ్యూజ్‌ లాగానే.. శిక్ష విధించే నేరంగా ఘోస్టింగ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.


భారత్‌లో ఘోస్టింగ్‌ను క్రిమినల్ చర్యగా ప్రకటించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని ట్రై లీగల్ ఫర్మ్ ప్రతినిధి నిఖిల్ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. భారతీయ చట్టాల ప్రకారం మానసిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ఉంది. కానీ, సాధారణంగా ఇలాంటి ఘోస్టింగ్‌ను భారత చట్టాలు గుర్తించలేదని నరేంద్రన్ తెలిపారు. మానసిక వైద్య నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్ సైకాలజిస్ట్, డేటింగ్ కోచ్ ప్రాచి వైశ్ ప్రకారం.. ఘోస్టింగ్ వేధింపులు, అబ్యూజ్ కిందకు రాదు. కానీ, ఇది ఒక టాక్సిక్ ప్యాటర్న్ అని చెబుతున్నారు.


ఇది ఎందుకు ఆందోళన చెందాల్సిన విషయం..?


2024 నాటికి భారత్‌లో దాదాపు 10 కోట్ల మంది డేటింగ్ యాప్స్‌ను వాడుతున్నారని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ఆందోళనకర విషయం ఏంటంటే.. 2023లో చేసిన ఓ సర్వే ప్రకారం.. 68 శాతం భారత యూజర్లు ఘోస్టింగ్ లేదా వేధింపులకు గురయ్యారట. మిల్లీనియల్స్, జెన్ జీ యువతే ఈ డేటింగ్ యాప్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారట. ఇలా ఘోస్టింగ్‌కు గురవుతున్న వారిలో ఒత్తిడి, యాంక్సైటీ, నేనేం చేశాననే అపరాధ భావన ఎక్కువ అవుతున్నాయట. అలా ఫ్రెండ్‌షిప్‌లో, రిలేషన్‌షిప్‌లో, వివాహ బంధాల్లో కూడా ట్రస్ట్ ఇష్యూలు వస్తున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో యువత నేరాలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఘోస్టింగ్ అనేది అనూహ్యంగా, ఒకవైపు నుంచి జరిగే చర్య. దాన్ని అరికట్టడానికి చట్టాలు చేయకున్నా, శిక్షలు విధించకున్నా.. యువతలో అవగాహన కోసం కార్యక్రమాలు చేపట్టాలి. ఆధునిక పోకడలతో కాలక్రమేనా అనేక మార్పులు వస్తాయి. అవి యువత దృష్టికోణాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చేయగలవు. అందుకే వాటన్నింటి పట్ల సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను యువతకు అందించాలి. ఆ దిశగా ఇళ్లలో, పాఠశాలలు, కాలేజీల్లోనే అడుగులు పడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa