షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా చైనాలోని టియాంజిన్‌లో జరిగిన కీలక భేటీలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారత్-చైనా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం సరైన నిర్ణయమని స్పష్టం చేశారు. ఏనుగు, డ్రాగన్ కలిస్తేనే ప్రపంచ శాంతి అని వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన సుంకాలు, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏడు సంవత్సరాల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం, 2020లో గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ సమావేశం జరగడం శుభపరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.
జిన్‌పింగ్ తన ప్రారంభ ప్రసంగంలో భారత్-చైనా దేశాలను "ప్రాచీన నాగరికతలు"గా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా.. "గ్లోబల్ సౌత్" లో ముఖ్యమైన సభ్యులుగా, ఇరు దేశాలు తమ ప్రజల సంక్షేమాన్ని పెంపొందించే చారిత్రక బాధ్యతను మోస్తున్నాయని అన్నారు. కేవలం తమ ప్రజల పురోగతికే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల పునరుజ్జీవనం, మానవ సమాజ పురోగతిని ప్రోత్సహించడంలో కూడా కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ సూచించారు. "రెండు దేశాలు మంచి పొరుగు సంబంధాలు, స్నేహపూర్వక బంధాలను కలిగి ఉండటం, ఒకరి విజయాన్ని మరొకరు ప్రోత్సహించుకునే భాగస్వాములుగా ఉండటం, 'డ్రాగన్, ఏనుగు' కలిసి రావడం సరైన నిర్ణయం" అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. దీని వల్లే ప్రపంచ శాంతి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
చైనా- భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. ఇరు దేశాలు వ్యూహాత్మక దృక్పథంతో, దీర్ఘకాలిక ఆలోచనతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ భేటీ దాదాపు 50 నిమిషాల పాటు జరిగింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సంబంధాలను "పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం" ఆధారంగా ముందుకు తీసుకువెళ్లడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించి.. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం ద్వారా సరిహద్దు సమస్యలు పరిష్కారం అయ్యాయని.. ఇది ఇరు దేశాల భవిష్యత్తు సహకారానికి మంచి సంకేతమని వివరించారు.
ఈ భేటీలో ఇరు దేశాలు కేవలం ద్వైపాక్షిక సంబంధాల గురించే కాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించుకున్నాయి. ముఖ్యంగా యుఎస్-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందనే అంశంపై ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీతో ఇరు దేశాల మధ్య కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి, కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉన్నత స్థాయి సమావేశాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయ పడతాయని వారు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa