కృత్రిమ మేధ మానవాళిపై ఎంతటి ప్రభావం చూపుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ఏఐ సహాయం తీసుకుని తన తల్లిని హత్య చేశాడు. అనంతరం అతడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనపై తల్లి నిఘా పెట్టిందని, విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేయొచ్చని చాట్‌జీపీటీ చెప్పిన సమాచారం ఆధారంగా అనుమానించిన ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇలా ఏఐ సాయంతో హత్య జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన స్టెయిన్-ఎరిక్ సోయెల్‌బర్గ్ అనే యువకుడు.. తల్లి అతడిపై గూఢచర్యం చేస్తోందని, సైకెడెలిక్ డ్రగ్‌తో విషం ఇవ్వడానికి ప్రయత్నించవచ్చని చాట్‌బాట్ నమ్మించింది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ‘ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన చాట్‌బాట్.. సోయెల్‌బర్గ్ హత్యాయత్నాలకు గురి కావచ్చని.. నువ్వు పిచ్చివాడివి కావు’ అని చాట్‌బాట్ తెలిపింది. గతంలో టెక్ కంపెనీలో పనిచేసి మతిస్థిమితం కోల్పోయిన 56 ఏళ్ల ఎరిక్.. తన తల్లి సుజాన్ ఎబెర్సన్ ఆడమ్స్‌తో కనెక్టికట్‌లో కలిసి ఉంటున్నాడు. ఇరువురూ ఆగస్టు 5న చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తలపై బలమైన గాయం, మెడపై కత్తిపోట్లతో ఆడమ్స్ చనిపోయినట్టు చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. అలాగే, సోయెల్‌బర్గ్ మెడ, ఛాతీపై కూడా బలమైన గాయాలున్నాయని, అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
తల్లీకొడుకులు చనిపోవడానికి కొన్ని నెలల ముందు సోయెల్‌బర్గ్ తాను 'బాబీ' అని ముద్దుగా పిలిచే చాట్‌బాట్‌తో మాట్లాడుతుండేవాడని గుర్తించారు. చాట్‌జీపీటీతో గంటల తరబడి మాట్లాడిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. మతిస్థిమితం కోల్పోయిన సోయెల్‌బర్గ్.. తనను ఓ రాక్షసుడిలా భావిస్తోందని, విషం పెట్టి చంపడానికి ప్రయత్నిస్తుందని చాట్‌బాట్ ద్వారా నమ్మాడు. ‘మనం వేరేచోట కలిసి ఉంటాం.. మళ్ళీ మనల్ని మనం ఒకచోట చేర్చుకునే మార్గాన్ని కనుగొంటాం, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అవుతావు’ అని సోయెల్‌బర్గ్ చివరిసారిగా పోస్ట్‌చేసిన మెసేజ్‌లో అన్నాడు. దీనికి చాట్‌బాట్ ‘తుదిశ్వాస వరకు, ఆ తర్వాత కూడా మీతో’ అని బదులిచ్చింది.
చాట్‌జీపీటీని ఎక్కువగా ఉపయోగించేవారిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఏఐ చాట్‌బాట్‌ను విస్తృతంగా వినియోగించి జరిగిన మొదటి హత్య ఇదేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక హైలైట్ చేసింది. ఈ ఘటనపై స్పందించిన చాట్‌బాట్‌ను తయారుచేసిన ఓపెన్ఏఐ సంస్థ.. దర్యాప్తు కోసం గ్రీన్‌విచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించినట్లు తెలిపింది. ‘ఈ విషాద ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది.. బాధిత కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, అమెరికాకు చెందిన ఓ తల్లిదండ్రులు.. తమ 16 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు చాట్‌జీపీటీ కారణమని ఆరోపిస్తూ దావా వేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa