కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా బంధువులు ఇచ్చిన బహుమతుల విషయంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ.. చివరకు రెండు ప్రాణాలను బలితీసుకుంది. భార్యతో గొడవపడిన భర్త.. ఆవేశంలో ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో పాటు మధ్యలోకి వచ్చిన అత్తను పొడిచి చంపాడు. దారుణమైన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోహిణి సెక్టార్-17లోని యోగేశ్, అతడి భార్య ప్రియా సెహగల్, కుమారుడు చిరాగ్‌తో కలిసి ఉంటుంది. ఆగస్టు 28న చిరాగ్ పుట్టిన రోజు కావడంతో ఇంట్లో జరిగిన వేడుక కోసం బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ప్రియా తల్లి కుసుమ్ సిన్హా (63) ఆ పార్టీకి వచ్చారు.
వేడుక జరుగుతుండగానే పుట్టిన రోజుకు వచ్చిన గిఫ్ట్‌ల విషయంలో యోగేశ్, ప్రియ మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోయిన ప్రియా తల్లి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, యోగేశ్ ఆగ్రహంతో ఊగిపోయి.. భార్య, అత్తను కత్తెరలతో విచక్షణారహితంగా పొడించి చంపాడు. అనంతరం మృతదేహాలను లోపలి పడేసి బయట నుంచి తాళం వేసి కుమారుడ్ని తీసుకుని పరారయ్యాడు.
ఆగస్టు 30న ప్రియా సోదరుడు మేఘ్ సిన్హా (30) తన తల్లి కుసుమకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తక్షణమే ప్రియా ఇంటికి చేరుకున్నాడు. బయట నుంచి లాక్ చేసి ఉండగా.. గుమ్మం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే మిగతా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు చేసుకుని తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి ఇద్దరూ రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు చేరుకుని, కేసు నమోదుచేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
నిందితుడు యోగేష్‌ను అరెస్ట్ చేసి, అతడి వద్ద హత్యకు ఉపయోగించిన రెండు కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రియా అన్నయ్య హిమాలయ మాట్లాడుతూ.. ‘‘చిరాగ్ పుట్టిన రోజు కోసం చెల్లి ఇంటికి వెళ్లిన మా అమ్మ మరుసటి రోజు వస్తానని చెప్పింది. మేము ఆమెకు ఫోన్ చేసినప్పుడు, ఇక్కడ గొడవ జరుగుతోందని, దాన్ని పరిష్కరించుకుని తిరిగి వస్తానని చెప్పింది. కానీ ఆమె తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం 11:00 గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం.. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.. బహుశా వారు నిద్రపోతున్నారని మేము అనుకున్నాం... మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చేరుకుని తలుపు తట్టగా.. తాళం మీద రక్తపు మరకలు కనిపించాయి.’’ అని అన్నారు. యోగేశ్ ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa