ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ దారుణ హత్య

international |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 05:25 PM

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన ఒక దారుణ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఆండ్రీ పరుబిని.. ఆయన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్య రాజకీయ వర్గాలతో పాటు దేశ ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పరుబిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఉంటారని పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన యుద్ధం నడుస్తున్న ఉక్రెయిన్‌లో భద్రతాపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచింది.


పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఆండ్రీ పరుబి నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి అనేక మార్లు కాల్చి మరీ చంపాడు. ముఖ్యంగా డెలివరీ ఏజెంట్‌లా వచ్చిన అతడు ఎలక్ట్రిక్ బైక్‌పై కనిపించాడు. హత్యానంతరం అతడు అదే బైకుపై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సంఘటన జరిగిన సమయంలో ఆండ్రీ పరుబి ఒక్కరే ఇంట్లో ఉన్నట్లు సమాచారం. పరుబి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందా లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ దారుణ హత్యపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సహా అనేక మంది ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


ఇది దారుణమైన హత్య అని.. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామంటూ జెలెన్‌స్కీ వివరించారు. దర్యాప్తు కూడా సమగ్రంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు కీవ్‌లో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి.. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు ఫుటేజీని కూడా తీసుకుని నిందితుడి ఫొటోలను పోలీసులు అందరికీ పంపించారు. చూడాలి మరి ఎప్పటిలోగా వీరు నిందితుడిని పట్టుకుంటారనేది.


ఆండ్రీ పరుబి ఉక్రెయిన్ రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. 2016 నుంచి 2019 వరకు ఆయన ఉక్రెయిన్ పార్లమెంట్ (వెర్ఖోవ్నా రాడా) స్పీకర్‌గా పనిచేశారు. దేశ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా 2014లో జరిగిన మైదాన్ విప్లవంలో ఆయన ప్రముఖ నాయకుడిగా వ్యవహరించారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రజలు ఉద్యమించినప్పుడు పరుబి ఒక కీలకమైన శక్తిగా నిలిచారు. పశ్చిమ దేశాల అనుకూల విధానాలకు ఆయన మద్దతుగా ఉండేవారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆయన ఉక్రెయిన్ తరపున గట్టిగా మాట్లాడేవారు.


ఆయన నాయకత్వంలోనే ఉక్రెయిన్ పార్లమెంట్ అనేక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు రష్యా నుంచి ఉక్రెయిన్ దూరం కావడానికి, యూరోపియన్ యూనియన్ వైపు అడుగులు వేయడానికి దోహదపడ్డాయి. అలాంటి ఒక ప్రముఖ వ్యక్తిని హత్య చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ హత్య రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి, ఉక్రెయిన్‌లోని అంతర్గత రాజకీయాలకు సంబంధించినది కావచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa