ప్రస్తుత కాలంలో పిల్లల స్కూల్ ఫీజులు.. తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారిపోతున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీలకే లక్షలకు లక్షలు డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. నెలకు లక్షకుపైగా సంపాదించేవారు కూడా పిల్లల స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. అడ్డగోలుగా పెంచుతూ.. కట్టడి లేని ప్రైవేటు ఫీజులతో చదువుకోవడం కాకుండా చదువు'కొనడం' అవుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతీ సంవత్సరం.. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో అధిక ఫీజుల గురించి ఆందోళనలు, నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. ఆ తర్వాత అంతా గప్ చుప్ అయిపోవడంతో మళ్లీ ఏడాది వరకు ఫీజుల మాటే ఉండదు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ స్కూల్‌లో ఒకటో తరగతికి రూ.7.35 లక్షల ఫీజుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు వివరాలకు సంబంధించిన ఓ రిసిప్ట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. అది చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తరగతికే ఏడాదికి రూ. 7.35 లక్షలకు పైగా ఫీజు ఉంటే.. పిల్లలను చదివించేది ఎలా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. హార్దిక్ పాండ్యా అనే వ్యక్తి.. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 2025-26 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక ఆ ఫీజు రిసిప్ట్‌లో ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (1 నుంచి 5వ తరగతులు)లో చేరేందుకు.. ఒక టర్మ్‌కు రూ.3.67 లక్షలు చెల్లించాలని ఉంది. ఇక ఏడాదికి రెండు టర్మ్‌లకు మొత్తం ఫీజు రూ.7.35 లక్షలు అవుతుందని పేర్కొన్నారు. ఇక దీనికి అదనంగా.. మరో రూ.1 లక్ష నాన్ రిఫండబుల్ అడ్మిషన్ ఫీజు, రూ.1,000 అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందని తెలిపారు.
ఈ స్కూల్ ఫీజు రిసిప్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఫీజులు ఉంటే.. ధనవంతులు కూడా తమ పిల్లలను అలాంటి స్కూల్‌లకు పంపించే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు. ఏడాదికి రూ.50 లక్షల ప్యాకేజీ ఉండే.. సాఫ్ట్‌వేర్ జంటలు కూడా తమ ఇద్దరు పిల్లలను చదివించేందుకు.. ఫీజులు భరించడం చాలా కష్టమని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. విద్య అనేది ఒక ప్రాథమిక మానవ హక్కు అని.. ఈ రకంగా భారీగా ధరలు నిర్ణయించడం సమాజంలో భారీగా అసమానతలను పెంచుతుందని ఇంకో నెటిజన్ విమర్శించాడు.
మరోవైపు.. స్కూల్ ఫీజులకు సంబంధించి నెట్టింట ఇంకో చర్చ కూడా జరుగుతోంది. స్థానిక స్కూల్ ఫీజులు, ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులకు మధ్య వ్యత్యాసాలను నెటిజన్లు చర్చిస్తున్నారు. బెంగళూరు నగరంలోని స్కూల్ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నట్లు అనిపించినా.. చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడాది ఫీజు రూ. 27 లక్షలు ఉందని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
తాజాగా వైరల్ అవుతున్న ఫోటోతో.. మార్కెట్‌ను బట్టి ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేయడం సరైందేనా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే.. ఇంత భారీగా ఖర్చు పెట్టాలా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులకు.. ఇంటర్నేషనల్ స్థాయి విద్య తమకు అందుబాటులో లేకుండా పోతోందని భయాలు పెరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa