ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దాడులను సమర్ధంగా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరిన్ని భారత్ సమకూర్చుకోనుంది. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించగలిగే క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం రష్యా, భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాదిలో మాస్కో అందజేసే అవకాశం ఉంది. ఓ యూనిట్‌ను 2026లోనూ.. రెండోది 2027లోనూ రష్యా డెలివరీ చేయనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండూ 2018లో భారత్ ఆర్డర్ చేసిన ఐదు యూనిట్లలో భాగమే. గతేడాది రష్యాలో పర్యటించిన రక్సణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఎస్-400 వ్యవస్థలను అందజేయడంలో జాప్యంపై ప్రస్తావించారు. అలాగే, ఇటీవల జరిగిన భారత్-రష్యా ద్వైపాక్షిక సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది.
ఈ రెండింటితోపాటు భారత్ ప్రతిష్టాత్మక ‘ సుదర్శన చక్ర ’ ప్రాజెక్ట్ అభివృద్ధికి సహాయపడేలా మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని కూడా యోచిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరి బహుళస్థాయి రక్షణ, అధునాతన నిఘా, సైబర్ భద్రత వ్యవస్థలను పటిష్ఠం చేయనున్నట్టు తెలిపారు.
మాస్కో అధికారిక మీడియా టాస్‌తో రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ- టెక్నికల్ కో-ఆపరేషన్ చీఫ్ దిమిత్రి షుగేవ్ మాట్లాడుతూ.. ‘‘భారత్ వద్ద ఇప్పటికే మా S-400 వ్యవస్థ ఉంది. కొత్తగా మరిన్ని యూనిట్లు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది.. ఈ విషయంలో మా సహకారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం మేము చర్చల దశలో ఉన్నాం’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఎస్-400 భారత సైన్యానికి విలువైన ఆస్తి అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ గేమ్ ఛేంజర్ పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. సైనిక సంఘర్షణలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేపట్టిన దాడులను తిప్పికొట్టి, దాయాది రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ రక్షణ వ్యవస్థ 600 కిలోమీటర్ల పరిధిలో శత్రువు కార్యచరణను ట్రాక్ చేసి.. ఒకేసారి 100 లక్ష్యాలను గుర్తించగలదు. 400 కిలోమీటర్ల పరిధిలోని బాంబర్లు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ముందస్తు హెచ్చరిక యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులపై కూడా దాడి చేయగలదు.
ప్రతి రెజిమెంట్ లేదా యూనిట్‌లో S-400 వ్యవస్థ ఎనిమిది లాంచ్ వెహికల్స్‌పై అమర్చి ఉంటుంది. ఒక్కొదానిలో నాలుగు క్షిపణులు ఉంటాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పును ఎదుర్కోవడానికి 2018లో రష్యా నుంచి S-400లను భారత్ కొనుగోలు చేసింది. మొత్తం రూ.39,000 కోట్లతో ఐదు S-400 ట్రయంఫ్ దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల కోసం ఒప్పందం జరిగింది. కానీ, వీటి డెలివరీ చాలాసార్లు వాయిదా పడింది.
2021, 2023 మధ్య మూడు S-400 యూనిట్లు అందించింది. మిగిలిన రెండు ఇంకా రాలేదు. ఈ మూడు యూనిట్లు అదమ్‌పూర్ (పంజాబ్), తూర్పు, పశ్చిమ సెక్టార్‌లో మోహరించారు.
చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలోనూ S-400 భారత్-రష్యా సహకారానికి కీలక సూచన. ఈ ద్వైపాక్షిక సమావేశం ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న మైత్రిని ప్రదర్శించింది. ఆయిల్ కొనుగోలు నిలిపివేయాలన్న అమెరికాను భారత్ ధిక్కరించడాన్ని రష్యా కూడా ప్రశంసించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa