ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకస్మిక వరదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 08:20 PM

గత కొద్ది రోజులుగా దేశాన్ని వణికిస్తోన్న ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్‌లు, మెరుపు వరదలపై సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌ ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ విపత్తులకు కొండ ప్రాంతాల్లో చెట్లను అక్రమంగా నరికివేయడమే కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కూడిన సమాధానం ఇవ్వాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు, వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.


 ‘‘ఉత్తరాది రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు కొండ ప్రాంతాల్లో చెట్లను అక్రమంగా నరికివేయడమే అనడానికి మీడియాలో వస్తున్న నివేదికలు ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు.. వరదల్లో భారీ ఎత్తున కలప, దుంగలు కొట్టుకురావడం నివేదికల్లో గమనించాం’’ అని ధర్మాసనం పేర్కొంది. హిమాచల్‌ రాష్ట్రంలోని హిమ్రీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికివేత , అనధికార రహదారి నిర్మాణం, అక్రమ మైనింగ్, కలప వంటి పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త విజయేంద్ర పాల్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో ఆరోపించారు.


ఈ పిల్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆకస్మిక వరదలకు చెట్లు నరికివేత కూడా కారణం కావచ్చని అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా.. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో మెరుపు వరదలకు పుష్ప సినిమాలోని సీన్‌ను తలపించేలా ఓ నదిలో దుంగలు తెలియాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో హిమాచల్‌లో టింబర్ మాఫియాలు రెచ్చిపోతున్నాయని, ఇది ‘రియల్ పుష్ప సీన్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. పిల్ విచారణ సమయంలో సీజేఐ ధర్మాసనం ఈ వీడియోనే ప్రస్తావించినట్టు అర్థమవుతోంది. ఇదిలా ఉండగా, గత నెల ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో ఖీర్ గంగా నదికి మెరుపు వరద పోటెత్తి.. గ్రామానికి గ్రామమే భూస్థాపితమైంది.


ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు ఆకస్మిక వరదలతో అల్లాడుతున్నాయి. పంజాబ్‌లోని మొత్తం 23 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆ రాష్ట్రంలో 37 ఏళ్ల తర్వాత ఇటువంటి పరిస్థితి నెలకుంది. ఏకంగా 1,200 గ్రామాలను వరద ముంచెత్తింది. ఇప్పటి వరకూ 37 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. అనేక జిల్లాల్లోని ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏకంగా, 1.70 లక్షల హెక్టార్లలో పంట నీటి మునిగింది. పంజాబ్ రైతాంగాన్ని ఆకస్మిక వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa