ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో నవజాత శిశువును తల్లి ఫ్రిజ్‌లో పెట్టడం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా 15 రోజుల పసికందును తల్లే దగ్గురుండి మరీ ఫ్రిజ్‌లో పెట్టి పడుకుంది. బాబు కనిపించకపోవడం, ఏదో పని మీద చిన్నారి నానమ్మ ఫ్రిజ్ తెరిచి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన వెనుక క్షుద్రపూజలు, దుష్ట శక్తుల ప్రభావం ఉందని కుటుంబ సభ్యులు మొదట అనుమానించినప్పటికీ.. చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షల్లో ఆమె ఒక తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ప్రసవం తర్వాత వచ్చే ' పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ ' అనే రుగ్మతే ఈ విషాదానికి కారణమని వైద్యులు నిర్ధారించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళకు 15 రోజుల క్రితమే పండంటి మగబిడ్డ జన్మించాడు. అప్పటి వరకు చాలా హాయిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న చిన్న వాటికే విపరీతంగా కోప్పడడం, పిచ్చి పట్టి దానిలా అరవడం, తనలో తానే మాట్లాడుకోవడం వంటివి చేసింది. అయితే ఇవన్నీ చూసిన కుటుంబ సభ్యులు ఆమెకు ఎవరైనా చేతబడి చేసి ఉంటారని అనుకున్నారు. అందుకోసం ఓ పూజారి రప్పించి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రోజే పూజారిని ఇంటికి రమ్మని చెప్పారు. అయితే అతడు ఇంటికి వచ్చేసరికే సదరు మహిళ ఎవరూ ఊహించని పని చేసింది.
ముఖ్యంగా 15 రోజుల పసికందు పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తుండగా.. పాలు పట్టాల్సిందిపోయి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పడుకోబెట్టింది. అయితే చాలా సేపటి నుంచి బాలుడు ఏడుపు వినిపించక పోవడంతో.. కోడలు వద్దకు వచ్చింది. అయితే ఆసమయంలో ఆమె హాయిగా పడుకుని కనిపించగా.. బాలుడు మాత్రం ఎక్కడా లేడు. దీంతో విపరీతంగా భయపడిపోయిన ఆమె కుటుంబ సభ్యులందరినీ పిలిచి విషయం చెప్పింది. ఇల్లంతా వెతికింది. అయినా ఎక్కడా కనిపించలేదు. ఈక్రమంలోనే ఏదో పని మీద ఫ్రిజ్ తెరవగా.. అందులో బాలుడు కనిపించాడు.
అప్పటికే చిన్నారి చలికి వణికిపోతూ కనిపించగా.. అతడిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తు వైద్యులు సకాలంలో స్పందించి.. శిశువుకు చికిత్స అందించారు. బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతకాలం బాగానే ఉన్న కోడలు ఇలా వింతగా ప్రవర్తించడానికి కారణం అర్థం కాక వైద్యులకు చూపించారు. మహిళను పరిశీలించిన వైద్యులు ఆమెకు ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం లేదనీ.. ఆమె తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని నిర్ధారించారు.
"ప్రసవించిన తర్వాత కొందరిలో హార్మోన్ల మార్పుల వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనివల్ల వారు తమ ఆలోచనలను, భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. తాము చేస్తున్న పనులపై వారికి స్పృహ ఉండదు. దీనిని పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అంటారు. ఈ వ్యాధికి సరైన చికిత్స, కౌన్సెలింగ్ అవసరం" అని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుంగిపోయారు. ఎలాగైనా సరే తమ కోడల్ని బాగు చేయమంటూ వైద్యులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa