కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యభిచార గృహాల్లోకి వెళ్లి లైంగిక సేవలు పొందే వ్యక్తులను కేవలం 'కస్టమర్లు'గా పరిగణించలేమని తేల్చి చెప్పింది. వారిని కూడా అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం 1956 కింద విచారించి.. శిక్షించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చారిత్రక తీర్పు లైంగిక కార్మికుల హక్కులను, మానవ అక్రమ రవాణాను నిరోధించే చట్టం అసలు ఉద్దేశ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
జస్టిస్ వీ.జీ. అరుణ్ ఈ తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "వేశ్యలను వస్తువులుగా చూడటానికి వీళ్లేదు. వారి సేవలను పొందే వ్యక్తులు కేవలం 'కస్టమర్లు' కాదు, వారు ఈ అసాంఘిక కార్యకలాపంలో క్రియాశీలకంగా పాల్గొనేవారే" అని అన్నారు. ఒక వ్యక్తి లైంగిక సేవలకు డబ్బు చెల్లించడం అనేది ఆ లైంగిక కార్మికురాలిని బలవంతంగా లేదా నిర్బంధంగా ఈ వృత్తిలోకి నెట్టడానికి ప్రేరేపించడమేనని కోర్టు పేర్కొంది. "డబ్బు చెల్లింపు అనేది లైంగిక కార్మికులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా, తరచుగా మానవ అక్రమ రవాణా, బెదిరింపుల ద్వారా పని చేయడానికి ప్రోత్సహించే ఒక ప్రలోభంగానే పరిగణించాలి" అని కోర్టు కుండబద్దలు కొట్టింది.
ఈ తీర్పు 2021లో తిరువనంతపురం జిల్లా పెరూర్‌కడలో జరిగిన ఒక పోలీసు దాడి కేసులో వచ్చింది. ఆ దాడిలో పోలీసులు ఒక వ్యభిచార గృహాన్ని గుర్తించారు. అక్కడ ఒక గదిలో పిటిషనర్‌తో పాటు ఒక మహిళ, మరో గదిలో మరో వ్యక్తితో పాటు ఇంకో మహిళ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఇద్దరు వ్యక్తులు ఈ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని, మహిళలను వ్యభిచారం కోసం తీసుకువస్తున్నారని, వచ్చిన డబ్బును వారిద్దరూ తీసుకుంటున్నారని తేలింది. ఈ ఆపరేటర్లపై ఐటీపీ చట్టంలోని సెక్షన్లు 3, 4 (వ్యభిచార గృహాన్ని నడపడం, వ్యభిచారం ద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం) కింద కేసులు నమోదు చేశారు. అదే సమయంలో లైంగిక సేవలు పొందిన పిటిషనర్‌పై కూడా సెక్షన్ 5(1)(డి) (వ్యభిచారానికి ప్రేరేపించడం), సెక్షన్ 7 (ప్రజా ప్రదేశాలకు దగ్గరగా వ్యభిచారం చేయడం) కింద కేసులు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసులను సవాలు చేస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను కేవలం ఒక కస్టమర్‌నని.. వ్యభిచార కార్యకలాపాలను నడపడంలో లేదా నిర్వహించడంలో తనకు ఎటువంటి సంబంధం లేదని వాదించారు. గతంలో వచ్చిన కొన్ని తీర్పులను ఉదహరిస్తూ.. లైంగిక సేవలు పొందడం అనేది వ్యభిచారాన్ని ప్రోత్సహించడం కిందకు రాదని వాదించారు. అయితే ప్రాసిక్యూషన్ దీనికి గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత హైకోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలను స్పష్టం చేసింది. ఐటీపీ చట్టంలోని సెక్షన్ 3, 4 వ్యభిచార గృహాల నిర్వాహకులకు వర్తిస్తాయని కోర్టు ధృవీకరించింది.
కానీ ఒక వ్యభిచార గృహంలో లైంగిక సేవలు పొందడం అనేది చట్టంలోని సెక్షన్ 5(1)(డి) కింద వ్యభిచారాన్ని ప్రోత్సహించినట్లుగానే పరిగణించాలని తేల్చిచెప్పింది. "వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తిని కేవలం 'కస్టమర్'గా వర్ణిస్తే, మానవ అక్రమ రవాణాను నిరోధించడం, బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన వారిని రక్షించడం అనే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యమే దెబ్బతింటుంది" అని కోర్టు పేర్కొంది. ఈ కారణంగానే పిటిషనర్‌పై సెక్షన్లు 3, 4 కింద ఉన్న కేసులను కొట్టివేసినప్పటికీ.. సెక్షన్లు 5(1)(డి), 7 కింద ఉన్న కేసులను విచారణకు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఇకపై కేరళలో వ్యభిచార గృహాలకు వెళ్లే వ్యక్తులు కూడా చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa