ప్రముఖ అమెరికన్ కన్జర్వేటివ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి మొదటి ఫోటోను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం విడుదల చేసింది. అతడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సదరు సంస్థ ప్రజలను కోరింది. "ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో చార్లీ కిర్క్ హత్యకు సంబంధించిన సమాచారం ఇవ్వగల వ్యక్తిని గుర్తించడంలో ప్రజల సహాయాన్ని కోరుతున్నాం. దయచేసి 1-800-Call-FBI కి ఫోన్ చేయండి" అని ఎఫ్‌బీఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అంతేకాకుండా అనుమానితుడి గురించి సమాచారం పంచుకోవడానికి పౌరుల కోసం ఒక ఆన్‌లైన్ ఫారం లింక్‌ను కూడా ఎఫ్‌బీఐ సాల్ట్ లేక్ సిటీ విభాగం షేర్ చేసింది.
అమెరికన్ కన్జర్వేటివ్ కార్యకర్త అయిన చార్లీ కిర్క్‌ను బుధవారం ఉటాలోని ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాల్చి చంపారు. కిర్క్ గన్ కల్చర్‌పై మాట్లాడుతున్నప్పుడు.. ఆయన మెడపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హంతకుడు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపడానికి ఉపయోగించిన 'హై-పవర్డ్ బోల్ట్ యాక్షన్ రైఫిల్‌ను' ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. హంతకుడు హత్య తర్వాత ఆయుధాన్ని అడవిలో వదిలి పారిపోగా.. దాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. అలాగే హంతకుడిని గుర్తించడానికి సహాయపడే ఒక కీలకమైన వీడియో ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
దర్యాప్తు వివరాలను మరింత వెల్లడిస్తూ.. చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన వ్యక్తి 'కాలేజీ వయసు' వాడని ఎఫ్‌బీఐ తెలిపింది. అనుమానితుడి కదలికలను ట్రాక్ చేశామని.. అతనిని గుర్తించే విషయంలో తాము చాలా నమ్మకంగా ఉన్నామని స్పష్టం చేసింది. అదనంగా హంతకుడు పారిపోయిన అడవి ప్రాంతంలో దర్యాప్తు బృందాలు అతని కాలి ముద్రలను, అరచేతి ముద్రలను, ముంజేతి ముద్రలను సేకరించినట్లు సమాచారం.
కిర్క్ మరణానికి కారణమైన వ్యక్తిని గుర్తించి, అరెస్ట్ చేయడానికి దారితీసే సమాచారం అందించిన వారికి 1,00,000 డాలర్ల రివార్డ్ ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. ఎవరికైనా సమాచారం తెలిస్తే 1-800-CALL-FBI నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు కోరారు. ప్రజలు ఫోటోలు లేదా వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ఒక లింక్‌ను కూడా అధికారులు ప్రచురించారు. అయితే చార్లీ కిర్క్‌ను ఉటా కాలేజీ క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్యంగా చేసుకునే చంపినట్లు ఎఫ్‌బీఐ సాల్ట్ లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ రాబర్ట్ బోహ్ల్స్ తెలిపారు. హంతకుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని.. అయితే సమీప అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa