ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు గడువు సమీపిస్తోంది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకే గడువు ఇచ్చారు. ఇప్పటీ ఇంకా తమ రిటర్నులు ఫైల్ చేయని వారు వెంటనే పూర్తి చేయడం మంచిది. లేదంటే ఆ తర్వాత పెనాల్టీలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు.. ఇప్పటికే తమ రిటర్నులు ఫైల్ చేసిన వారు రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. గంటల వ్యవధిలోనే కొందరికి రీఫండ్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం రోజులు గడుస్తున్న తమకు రీఫండ్ రావడం లేదని చెబుతున్నారు. రీఫండ్ స్టేటస్ చూస్తే అండర్ ప్రాసెస్ అనే చూపిస్తోందని వాపోతున్నారు. మరి రీఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి? స్టేటస్ ఎలా చెక్ చేయాలి? కారణాలేంటి అనేవి తెలుసుకుందాం.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంతో పాటుగా 30 రోజుల్లోగా దానిని ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేస్తేనే ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ప్రాసెస్ చేస్తుంది. విజయవంతంగా ప్రాసెస్ పూర్తయితేనే రీఫండ్ జారీ చేస్తారు. సాధారణంగా రీఫండ్ జారీ చేసేందుకు 2-5 వారాల సమయం పడుతుంది. అయితే, ఇటీవలి కాలంలో చాలా మంది ట్యాక్స్ పేయర్లకు గంటల వ్యవధిలోనే వచ్చినట్లు సమాచారం. దీంతో రోజుల తరబడి సమయం గడుస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం అధికారిక పోర్టల్ www.incometax.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత టాప్ మోనూలోని సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో రీఫండ్ స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకుని అందులో అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు స్కీన్‌పై మీ రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది. మీ రిటర్న్స్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? ఇ-వెరిఫికేషన్ ఎప్పుడు పూర్తి చేశారు? ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది, రీపండ్ ఎప్పుడు జారీ చేశారు అనే వివరాలు కనిపిస్తాయి.
ఆలస్యానికి ఇవే కారణాలు కావచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ జారీ చేసేందుకు గల కారణాలను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ చేయకపోవడంతో ఆలస్యం కావచ్చంటోంది. బ్యాంక్ ఖాతాను వ్యాలిడేట్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతాలోని పేరు, పాన్ కార్డులోని పేరుతో సరిపోలకపోయినా రీఫండ్ ఆగిపోతుంది. ఐటీఆర్‌లోని బ్యాంక్ ఖాతా మూసివేసినా, బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా ఉన్నా రీఫండ్ రాకపోవచ్చు. పాన్ కార్డు, ఆధార్‌తో లింక్ చేయని సందర్భంలోనూ రీఫండ్ ఆపేస్తారు. అలా జరిగితే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.
పాన్-ఆధార్ లింక్ చేయాలని సూచిస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేసి ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోయినా రీఫండ్ రాదు. అలాగే పెద్ద మొత్తంలో రీఫండ్ జారీ చేసే సందర్భంలో ఎక్కువ తనిఖీలు నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు ఇలా కూడా ఆలస్యం కావచ్చు. ఏదేమైనా ఇ-మెయిల్ ద్వారా సమాచార నోటీసు ఇస్తారు. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏ నోటీసు వచ్చినా వెంటనే స్పందించాలి. అందులో సూచించిన ప్రకారం వివరాలు అందించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa