మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తోంది. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ నిధి రుణం మీద 12 శాతం వడ్డీ ఉంటే.. బ్యాంక్ లింకేజీ రుణాలపై 13 శాతం వడ్డీలు వసూలు చేసేవారు. అయితే డ్వాక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. రెండు రకాల రుణాల వడ్డీలలోనూ రెండు శాతం చొప్పున రాయితీ అందిస్తోంది. దీంతో స్త్రీ నిధి రుణం మీద వడ్డీ 10 శాతంగా, బ్యాంక్ లింకేజీ రుణంపై వడ్డీ 11 శాతంగా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా డ్వాక్రా సంఘాలపై వడ్డీ భారం తగ్గనుంది. మరోవైపు గతంలో డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీతో రుణాలు అందించేవారు. అయితే డ్వాక్రా సంఘం తీసుకున్న రుణంలో రూ. 3 లక్షల వరకూ మాత్రమే ఈ పావలా వడ్డీ వర్తించేది. మిగతా అప్పునకు రూపాయి పావలా వడ్డీగా విధించేవారు. ఇందులో డ్వాక్రా సంఘం రూపాయి వడ్డీ చెల్లిస్తే ప్రభుత్వం పావలా వడ్డీ చెల్లించేది. అయితే ఈ విధానం ద్వారా అనుకున్న మేరకు మహిళలు లబ్ధి పొందలేకపోతున్నారనే భావనతో తాజాగా వడ్డీలపై 2 శాతం రాయితీ నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ఎంత రుణం తీసుకున్నప్పటికీ వడ్డీలో రెండు శాతం రాయితీ ఆ సంఘాలకు లభించనుంది. దీంతో డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఉపశమనం లభించనుంది. అయితే ప్రతి నెలా నిర్ణీత తేదీలోగా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలు రుణ వాయిదాలను నెలవారీగా బ్యాంకులకు చెల్లిస్తుంటాయి. అలాగే ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పొదుపును కూడా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే రుణ వాయిదాల చెల్లింపులు, పొదుపు చెల్లింపుల సమయంలో అక్కడక్కడా అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తుంటాయి.
ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కలు పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ సాయంతో డ్వాక్రా సంఘాల బ్యాంక్ లావాదేవీలు, డ్వాక్రా సంఘంలోని సభ్యులు పరిశీలించుకోవచ్చు. అలాగే రుణ వాయిదాల చెల్లింపులు, పొదుపు ఖాతాలో డబ్బులు జమ వంటి వివరాలను తనిఖీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa