సాగర తీరం విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు ఐటీ కంపెనీలను విశాఖలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారంతో ఇప్పటికే విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో కొన్నింటికి భూకేటాయింపులు కూడా జరిగిపోయాయి. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మధురవాడ ప్రాంతానికి మరో గుడ్ న్యూస్ అందింది.
మధురవాడలో రూ.1000 కోట్లతో రెండు కీలకమైన ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం రోజున జీవీఎంసీ 6వ వార్డులో ఆయన పర్యటించారు. రోడ్లు, డ్రెయిన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. మధురవాడలో రెండు ముఖ్య ప్రాజెక్టులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు .రూ.535 కోట్ల నిధులతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, సీవేజ్ లైన్ నిర్మాణం చేపట్టనున్నట్టు గంటా శ్రీనివాసరావు వివరించారు. ఇందులో రూ.498 కోట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తోందని.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మిగిలిన మొత్తాన్ని భరించనుందని వెల్లడించారు.
మధురవాడలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. రూ.120 కోట్ల వ్యయంతో మధురవాడ జోన్‌లో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు నిర్మించనున్నట్లు వివరించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తై, అందుబాటులోకి వచ్చిన తర్వాత మధురవాడ రూపురేఖలు మారిపోతాయని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
మరోవైపు భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రస్తుతానికి 86 శాతం పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేసి.. విమానాల రాకపోకలు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఎయిర్ పోర్టు నిర్మాణ పనులలో వేగం పెంచారు. గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa