ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘9 ఏళ్లు జైల్లో ఉన్నందుకు రూ. 9 కోట్లు ఇవ్వాలి’,,,ముంబై పేలుళ్ల కేసు నిర్దోషి డిమాండ్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 08:45 PM

వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది భారతీయ న్యాయవ్యవస్థ. అవును మరి.. నిర్దోషులకు శిక్ష పడి.. కొన్నాళ్ల తర్వాత బయటకు వస్తే వారి జీవితం ముందున్నంత సాఫీగా అయితే ఉండదు. కోర్టు శిక్ష పేరుతో జైల్లో గడిపిన కాలం తిరిగి రాదు. అలానే దోషి అంటూ వారి మీద పడ్డ ముద్ర కూడా చెరిగిపోదు. మొత్తానికి ముందులా వారి జీవితం ఉండదు. మరి వీటన్నింటిని ఎవరూ సరి చేయాలి.. ఎలా వారికి పరిహారం చెల్లించాలి అంటే అవి సమాధానాలు లేని ప్రశ్నలే అవుతాయి. తాజాగా ఓ వ్యక్తి కూడా నిర్దోషి అయిన తనను అనవసరంగా దోషిగా ఆరోపించి చిత్రవధ చేశారని.. కస్టడిలో నరకం చూపారని ఇందుకు బదులుగా తనకు రూ.9 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ వివరాలు..


2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో అబ్దుల్ వాహిద్ షేక్ అనే వ్యక్తిని ట్రయల్ కోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. పది సంవత్సరాల క్రితమే అతడు నిర్దోషిగా విడుదల అయ్యాడు. అయితే తాజాగా అబ్దుల్ తనపై తప్పుడు కేసు పెట్టినందుకుగానూ రూ.9 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. చేయని నేరానికి తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తున్నారు. తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మహారాష్ట్ర స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లలో ఫిర్యాదు చేశారు. అలానే తన పునరావాసానికి కూడా సాయం చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మిగిలిన నిందితులందరిని బాంబే హైకోర్టు ఈ ఏడాది జులైలో విడుదల చేసింది.


2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో... మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అబ్దుల్‌ని అరెస్టు చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత, 2015లో ఒక ప్రత్యేక కోర్టు ఆయనపై చేసిన ఆరోపణలను కొట్టి వేసి నిర్దోషిగా విడుదల చేసింది. ఈ సందర్భంగా అబ్దుల్ మాట్లాడుతూ.. ‘నిర్దోషిని అయిన నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైల్లో ఉన్న సమయంలో నాకెరీర్, చదువు, వ్యక్తిగత జీవితానికి.. తీరని నష్టం వాటిల్లింది. పైగా జైల్లో దారుణమైన కస్టడీ టార్చర్ కారణంగా నాకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి’ అని చెన్నుకొచ్చారు.


‘నన్ను టెర్రరిస్ట్ అని ముద్ర వేయడం వల్ల నిర్దోషిగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడం నాకు చాలా కష్టమైంది. నేను జైలులో ఉన్నప్పుడు నా కుటుంబం సామాజికంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. వైద్య ఖర్చుల కోసం, ఇతర అవసరాల కోసం దాదాపు రూ. 30 లక్షల అప్పు చేశాను. 9 ఏళ్లు జైల్లో ఉన్నందుకుగాను నాకు రూ.9కోట్లు చెల్లించాలి’ అని అబ్దుల్ డిమాండ్ చేస్తున్నారు.


ప్రస్తుతం అబ్దుల్ ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన సంపాదన మీదనే తన కుటుంబం నడుస్తుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఇన్నాళ్లు నష్టపరిహారం కోరకుండా.. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు గాను అబ్దుల్ మాట్లాడుతూ...తనతో పాటు ఉన్న సహ నిందితులకు శిక్ష పడటం వల్ల.. నైతిక కారణాల వల్ల పదేళ్లపాటు తాను నష్టపరిహారం కోరలేదని ఆయన అన్నారు.


ట్రయల్ కోర్టు 2015లో షేక్‌ను విడుదల చేసింది. కానీ మిగిలిన 12 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. మరణశిక్ష పడిన వారిలో ఒకరు 2021లో చనిపోయారు. జులై 2025లో బాంబే హైకోర్టు 12 మంది నిందితులని తీర్పు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ కేసును నిరూపించడంలో పూర్తిగా విఫలమైందని కోర్టు పేర్కొంది. 2006 జూలై 11న ముంబైలోని వెస్ట్రన్ రైల్వే సబర్బన్ నెట్‌వర్క్‌లో ఏడు రైలు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 180 మందికి పైగా మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa